22 జీవో.. ప్రాజెక్టు జీరో | - | Sakshi
Sakshi News home page

22 జీవో.. ప్రాజెక్టు జీరో

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

సాక్షి, మదనపల్లె : హంద్రీనీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ (ిపీబీసీ)కు కృష్ణా జలాలు పారించినా..అవి కరువు రైతాంగానికి ఎండమావిగానే మిగిలిపోతుంది. ప్రధానంగా దీనికి రెండు కారణాలు. అందులో.. 2015లో చంద్రబాబు జీవో నంబర్‌ 22 తెచ్చారు. ఇది ప్రాజెక్టు రైతాంగానికి రాసిన మరణ శాసనం. అప్పటిదాకా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చివరి ఎకరా వరకు నీరు పారించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు) పనులు చేపట్టాల్సి ఉంది. జీవో నంబర్‌ 22 ద్వారా చంద్రబాబు వాటి పనులను కాంట్రాక్టర్లు ఇష్టానికి వదిలేయగా పనులు జరగలేదు. ప్రాజెక్టు లక్ష్యం నెరవేరాలంటే పిల్ల కాలువల నిర్మాణం తప్పనిసరి. వీటి ద్వారా ఆయకట్టుకు చుక్క నీరు ఇవ్వకుండా ఈ పనులు నిలిపివేశాక ప్రాజెక్టు ఎలా పూర్తయినట్టు?. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రధాన కాలువ, ఉపకాలువలు ఉన్నాయి, ఒక్క పీబీసీకి తప్ప మిగతా వాటికి చుక్క నీరు పారించలేదు. అలాంటప్పుడు పుంగనూరు ఉపకాలువలో నీటిని పారించి..ఇదిగో ప్రాజెక్టు పూర్తయిందంటే నవ్వి పోవాల్సిందే.

రైతాంగానికి చంద్రబాబు శిక్ష

ఈ ప్రాజెక్టును తొలి నుంచి చంద్రబాబు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీన్ని 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టు చేసిన ఘనత ఆయనదే. దివంగత సీఎం వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 31 ప్యాకేజీల పరిధిలో ఎకరాకు రూ.4,500తో డిస్ట్రిబ్యూటరీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. తర్వాత కిరణ్‌ సర్కార్‌ ఎకరాకు రూ.10,500కు పెంచారు. 2015లో చంద్రబాబు జీవో నెంబర్‌ 22 తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటరీ పనులకు శాశ్వత సమాధి కట్టారు. 1,75,150 (అప్పటి ఒప్పందం ప్రకారం) ఎకరాలకు సాగునీరు అందకుండా మరణ శాసనం లిఖించారు. ఇప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టును నేనే పూర్తి చేశానని గత ఏడాది కుప్పంలోని పరమ సముద్రంచెరువుకు జలహారతి ఇచ్చి చంద్రబాబు ప్రకటించుకున్నారు. ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించాకే ప్రాజెక్టు పూర్తయినట్టు. ఒక ఎకరాకు సాగునీరు ఇవ్వని చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేశారని ప్రకటించడం హాస్యాస్పదమే.

సాగునీటి హక్కు కాలరాసిన చంద్రబాబు

హంద్రీనీవా ప్రాజెక్టు ప్రధాన, ఉప కాలువల నుంచి పిల్ల కాలువలను నిర్ణయించిన ఆయకట్టుకు చివరి ఎకరా దాకా తవ్వించాలి. ఈ పిల్ల కాలువల ద్వారానే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఒక్కసారి సాగునీరు అందిస్తే, తర్వాత అది రైతుల హక్కుగా మారుతుంది. రైతులు సాగునీటి సంఘాలుగా ఏర్పడి, ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు రైతులుగా రిజిస్ట్రేషన్‌ పొందుతారు. తర్వాత రైతులకు సాగునీరు పొందడం శాశ్వత హక్కుగా మారుతుంది. కరువు రైతులు బాగుపడడం ఇష్టంలేని చంద్రబాబు పిల్ల కాలువల విషయంలో రైతులకు తీరని ద్రోహం చేశారు. పిల్ల కాలువలు తవ్వించకుంటే రైతులకు హక్కులు ఏర్పడవని, దాంతో రైతులు సంఘటితం కాకూడదని ఇలా కుట్రపన్నారు. ఈ కుట్రకు బలైంది కరువు రైతులే. ప్రాజెక్టు పూర్తి చేశాం.. కుప్పానికి నీళ్లిచ్చాం అని చెప్పుకోవడం మినహా చంద్రబాబు రైతాంగానికి చేసిన ఒక్క ప్రయోజనం లేదు. గత ప్రభుత్వంలోనే వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పం నియోజకవర్గానికి కష్ణా జలాలు అందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు మరుగున పెట్టి తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.

1.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమాధి

జీవో నంబర్‌ 22తో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన తంబళ్లపల్లె, వాయల్పాడు, మదనపల్లె, పుంగనూరు, చిత్తూరు, పీలేరు, పలమనేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు కింద నిర్ణయించిన 1,75,150 ఆయకట్టుకు ఉపకాలువల ద్వారా సాగునీరు అందదు. ఈ జీవోతో ప్రాజెక్టు ఆశయం నీరుగారిపోయింది. ఆయకట్టుకు చుక్క నీరు కూడా అందించే పరిస్థితి లేకుండా పోయింది. గత చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ప్రాజెక్టు స్వరూపమే మారిపోయింది.

కుప్పంపై ప్రేమతో పీబీసీకే నీళ్లు

ప్రాజెక్టు పూర్తికే ఏమాత్రం చిత్తశుద్ధి చూపని చంద్రబాబు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ హయాంలో పూర్తయిన పుంగనూరు ఉపకాలువ (పిబిసి) ద్వారా 2019 జనవరిలో ఎన్నికల స్టంట్‌ గా కొద్దిపాటి నీటిని కాలువలో పారించి ఘనతగా ప్రచారం చేసుకున్నారు. ఇవి కూడా కుప్పం పై ప్రేమతోనే. ఆ ఏడాది కుప్పానికి నీళ్లు తరలించాలని ప్రయత్నించారు. నీటి లభ్యత లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. తర్వాత గత ప్రభుత్వంలో వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి అసంపూర్తి పిబిసి, గత చంద్రబాబు పాలనలో వదిలేసిన కుప్పం ఉప కాలువ పనులను పూర్తి చేయించారు. ఈ పనుల్లో చేయడం వల్లే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పానికి మొట్టమొదటిసారిగా కృష్ణా జిలాలను తరలించారన్నది అక్షరాల నిజం. ఈ నిజాన్ని దాచిపెట్టి చంద్రబాబు తానే కుప్పానికి నీళ్లు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. గత సీజన్‌ లో ఇదే కాలువ ద్వారా చంద్రబాబు కుప్పానికి కష్ణా జలాలు తరలించుకుపోయారు.

కృష్ణమ్మ ఎండమావే

పీబీసీలోకి కృష్ణమ్మ కళ్లముందు పారుతున్నా ఎకరా భూమిని కూడా తడపలేని పరిస్థితి. తమ పొలాల గుండా వెళ్తున్న కష్ణమ్మను చూసి రైతులు ఆవేదన చెందాల్సిందే తప్ప.. తమ పొలాల్లోకి వస్తుందన్న ఆనందం లేదు. ఈ కాలువ పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. కరువు ప్రాంతాలైన ఇక్కడి ఆయకట్టు భూములకు కష్ణా జలాలు అందిస్తే తప్ప మరో ప్రత్యామ్నయ మార్గం లేదు. కాలువ నిర్మాణం కోసం విలువైన భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కాలువలో పారుతున్న నీరుని చూసి దిగాలు పడాల్సింది తప్ప చేసేదేమీ లేని పరిస్థితి.

పీబీసీ సరే..మిగతా కాలువలు మాటేమిటి?

పీబీసీకి కృష్ణాజలాలు పారించినా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని (ప్రస్తుత అన్నమయ్య, చిత్తూరు) ప్రాజెక్టు ప్రధాన, ఉపకాలువ లైన తంబళ్లపల్లె బ్రాంచ్‌ కెనాల్‌, నీవా బ్రాంచ్‌ కెనాల్‌, చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ, వాయల్పాడు ఉపకాలువ, ఎల్లుట్ల ఉపకాలువలకు ఇంతవరకు చుక్కనీరుపాలించలేదు. సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో ప్రవహించే 30 కిలోమీటర్ల ప్రధాన కాలువలో చిన్నపాటి పనులు పూర్తి చేసి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోవడం లేదు. దీని ఫలితంగా పిబీసీ మినహా మిగతా ఉపకాలువలపై చూపుతోంది.

చెరువులు నింపే పరిస్థితి లేదు

ప్రాజెక్టులో అంతర్భాగంగా పిల్ల కాలువల నిర్మాణం ఉంది. చెరువులకు నీటిని అందించే ప్రణాళిక లేదు. ఇప్పుడు పిల్ల కాలువలు తవ్వించకపోవడంతో చెరువులకు నీరు ఇవ్వడానికి ప్రాజెక్టులో అనుమతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రైతులకు ప్రాజెక్టు ద్వారా కలిగించే ప్రయోజనం ఏమి కనిపించడం లేదు. ఒకవేళ చెరువులకు కష్ణా జలాలు ఇవ్వాలని భావించినప్పటికీ పూర్తిస్థాయిలో ఇచ్చే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు శాశ్వత కరువులోనే మగ్గిపోనున్నారు.

అడవులు తలపిస్తున్న కాలువలు

అన్నమయ్య జిల్లాలో ప్రధాన కాలువ, ఇతర ఉపకాలువలు అడవులను తలపిస్తున్నాయి. వాటి పనులు పూర్తి దశలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహణ గాలికి వదిలేసింది. నీటిని పారించకపోవడంతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి. కాలువల నిండా ముళ్ళపొదలు, ఊడిపోతున్న మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి.

2015లోనే హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీ పనులకు మంగళం

సాగునీటి సంఘాలు ఏర్పడకుండా చంద్రబాబు కుట్ర

పుంగనూరు ఉప కాలువకు నీళ్లొచ్చినా సాగుకు చుక్కనీరు దక్కదు

ముళ్ళపొదలతో నిండిపోయిన ప్రధాన, ఉపకాలువలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement