పీలేరు : జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు పీలేరుకు చెందిన ఎస్‌వీఎస్‌ఎన్ విద్యార్థిని ఐ.దీక్షిత ఎంపికై ంది. ఎస్‌వీఎస్‌ఎన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దీక్షిత రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ మాధవి చెప్పారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 3450
వినాయక విగ్రహాల ఏర్పాటు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా 3450 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన భక్తులు 3450 విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు 2840 మందికి అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. మిగిలిన దరఖాస్తులకు ఆదివారం రాత్రిలోగా అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఇవ్వొద్దు
రాయచోటి జగదాంబసెంటర్ : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసుకునే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు చోటివ్వొద్దని ఏపీఎస్పీడీసీఎల్ రాయచోటి డివిజనల్ ఇంజినీర్ లివింగ్ స్టోన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల్లో విద్యుత్ అలంకరణలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనన్నారు. అలంకరణ పనులను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు. అధిక వోల్టేజ్ కలిగిన విద్యుత్ దీపాలను వినియోగించే సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగుతోపాటు నాణ్యతతో కూడిన పరికరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు లోడ్ కలిగి ఉన్న వినాయకుడి మండపాలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామని తెలిపారు. ఆపైన లోడ్ కలిగి ఉన్న మండప నిర్వాహకులు నిబంధనల మేరకు రుసుమును చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ తీగలు తెగిపడడం లేదా వేలాడుతుండడాన్ని గుర్తించినట్లయితే, వాటికి దూరంగా ఉంటూ వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకుగానీ, సిబ్బందికి గానీ లేదా టోల్ఫ్రీ నంబరు: 1912కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలని కోరారు.
మట్టి గణపతులతో
పర్యావరణ పరిరక్షణ
రాయచోటి : మట్టిగణపతి పర్యావరణానికి రక్షణ అనే సందేశంతో ది భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పర్యావరణ హిత వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం డైట్‌లోని స్కౌట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కార్యాలయం జారీ చేసిన ఆదేశాల మేరకు శుక్ర, శనివారాల్లో జిల్లా వ్యాప్తంగా స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, యూనిట్ లీడర్ల ఆధ్వర్యంలో స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు మట్టి గణేష్ విగ్రహాల తయారీ, అవగాహన ర్యాలీలు, పోస్టర్ డ్రాయింగ్ పోటీలు, నినాదాల రచన, ఇంటింటా ప్రచారం వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్, ధర్మాకోల్, రసాయన రంగుల వినియోగాన్ని నివారించి సహజ మట్టి విగ్రహాలు, సహజ రంగులను ప్రోత్సహించాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. చెరువులు, కుంటలు, కాలువలు తదితర నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణహిత నిమజ్జన పద్దతులను పాటించాలని ప్రజలకు సూచించారని చెప్పారు.


