భక్తితో పూజించండి! | - | Sakshi
Sakshi News home page

భక్తితో పూజించండి!

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

ఆర్భాటాలు త్యజించండి..
రాయచోటి

‘నా ప్రియమైన భక్తులకు, నేను మీ విఘ్నాలు తొలగించే వినాయకుడిని. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు నన్ను మీ ఇళ్లకు, వీధులకు ఆహ్వానించి మీరు చూపే ఆదరాభిమానాలకు నేను ఎంతో సంతోషిస్తాను. అయితే, ఈ ఏడాది పండుగ వేళ నా మనసులోని ఆవేదనను ఈ లేఖ ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా మాటను ఒక్క క్షణం శాంతంగా ఆలకించండి.

భక్తులారా.. నేను నిరాడంబరతను ఇష్టపడే దేవుడిని. నాకు కేవలం ఒక గరిక పోచ సమర్పిస్తే చాలు, పరమ సంతోషంతో మిమ్మల్ని కరుణిస్తాను. దానికోసం వేల రూపాయలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేయనవసరం లేదు. ప్రస్తుతం ఒకవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి, మరోవైపు ’ఎల్‌నినో’ ప్రభావంతో గంగమ్మకు పెద్ద సమస్య ఎదురైంది. జలాశయాల్లో నీటి మట్టాలు నానాటికీ పడిపోతున్నాయి. నిమజ్జనం చేయడానికి కొన్ని చెరువుల్లో నీళ్లే లేవు. ఇంకొన్ని చోట్ల కేవలం అరకొర మాత్రమే ఉన్నాయి. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రాబోయే అక్టోబరు, నవంబరు మాసాల్లో గనుక వర్షాలు కురవకపోతే, వచ్చే వేసవిలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో వేడుకల పేరిట దుబారా ఖర్చులు వద్దు. ఉన్న కొద్దిపాటి జలవనరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో చేసిన నా భారీ విగ్రహాలను కొనుగోలు చేసి వాటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. రసాయనాల వల్ల నీరు కలుషితమవడమే కాకుండా, చెరువుల్లో పూడిక పెరిగిపోయి నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా తగ్గిపోతుంది. నా విగ్రహాల వల్ల మీకు భవిష్యత్తులో నీటి కష్టాలు తలెత్తకూడదనే నేను కోరుకుంటున్నాను. అందువల్ల దయచేసి పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలనే పూజించండి.

ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ వీధుల్లో భారీ విగ్రహాలు పెట్టకండి. నాకు భక్తి ముఖ్యం కానీ, భారీ విగ్రహాలు కాదు! నవరాత్రి వేడుకల పేరిట రోడ్లను, వీధులను పూర్తిగా మూసేసి పెద్ద పెద్ద మండపాలు వేస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం వంటి పట్టణాల్లో అసలే ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువ. దీనికి తోడు దారులు మూసేయడంతో రోగులు, వృద్ధులు, సామాన్య ప్రజలు తమ రోజువారీ పనులకు వెళ్లలేక తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఇరుకు సందుల్లో ఇరుక్కుపోయిన జనం దారి లేక మనసులో నన్ను తిట్టుకునే పరిస్థితి కల్పించకండి. విఘ్నాలు తొలగించాల్సిన నేను, మీ అతి వల్ల సామాన్యుడికి ఒక ’విఘ్నం’గా మారకూడదన్నదే నా కోరిక. పరిస్ధితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే మనమంతా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.

మండపాల వద్ద సినిమా పాటలు, మితిమీరిన డీజే శబ్దాలతో ధ్వని కాలుష్యాన్ని సృష్టించి ప్రజల ప్రశాంతతను దెబ్బతీయకండి. ఈ విషయంలో జిల్లా ఎస్పీ నచికేతన్‌ విశ్వనాథ్‌ డీజేలను బ్యాన్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ఆయన నిబంధనలను గౌరవిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో భక్తి సంకీర్తనలు చేసుకోండి. అది నాకు, సమాజానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. భక్తి అనేది ప్రశాంతమైన హృదయంలో ఉండాలి కానీ, మైకుల ఘోషలో కాదు. ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పర్యావరణహితంగా ఈ వేడుకలను నిర్వహించుకోండి. ఆడంబరాలకు స్వస్తి పలికి, నిష్కల్మషమైన భక్తితో నన్ను కొలవండి.. మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తాను.

– మీ గణనాథుడు

ఎల్‌నినో వేళ గంగమ్మను రక్షిద్దాం –

కెమికల్‌ రంగుల

నిమజ్జనాన్ని అరికడదాం!

మట్టి వినాయకుడిని పూజిద్దాం –

పర్యావరణాన్ని

కాపాడుకుందాం!

భక్తి ఉండాలి

గుండె గదిలో –

డీజేల ఘోష వద్దు వీధి సందుల్లో!

బకెట్‌ నిమజ్జనం – ప్రకృతికి అభిషేకం!

భారీ విగ్రహాల పోటీ వద్దు – సామాన్యుడి రాకపోకలకు శాపం వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement