చదువుకుంటే లోకాన్ని జయించవచ్చు.. అక్షరం ముక్క వస్తే సమాజంలో ధైర్యంగా నిలబడవచ్చు.. అందుకే అన్నారు ‘అక్షరమే ఆయుధం’ అని! ఈ నినాదానికి నిలువెత్తు రూపమిస్తూ అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఒక ‘అ’ద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. చదువు ప్రాధాన్యతను చాటిచెప్పడానికి పుస్తకాల గది దాటి పాఠశాల మైదానంలోకి అడుగుపెట్టారు. నల్లని జడలు, తెల్లని యూనిఫామ్‌లతో మైదానంలో ఒక పద్ధతి ప్రకారం నేలపై కూర్చుని.. తెలుగు భాషకు ప్రాణమైన తొలి అక్షరం ‘అ’ ఆకారాన్ని, ఆ అక్షరంలో నుంచే శత్రువులను సంహరించే ఒక పదునైన బాణం (ఆయుధం) దూసుకుపోతున్నట్లుగా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. కేవలం అక్షరాస్యులు కావడం మాత్రమే కాదు, అన్యాయాలను ఎదిరించే పదునైన ఆయుధం కూడా చదువేనని మగువలు ఈ ‘అ’పూర్వ విన్యాసంతో నిరూపించారు. చదువుల తల్లీ.. నీకు వందనం అంటూ స్కూల్ ఆవరణలో బాలికలు చేసిన ఈ ప్రదర్శన అక్షరాస్యత దినోత్సవానికే ఒక ప్రత్యేక మకుటంగా నిలిచింది. – సాక్షి, మదనపల్లి


