మదనపల్లె టౌన్ : గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులు తమ పాలిట శాపంగా మారాయని కొండామరిపల్లి గ్రామం బోడిమల్లుదిన్నెకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాల కారణంగా కొందరు మద్యం మత్తులో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని వారు తాలూకా ఎస్‌ఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. కుటుంబాల్లో గొడవలు, మహిళలకు వేధింపులు పెరుగుతున్నాయని, గ్రామంలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాత్రి బస కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చేరుకున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి స్థానికులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎస్‌ఐ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించే బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసుల నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఎస్‌ఐకి ఫిర్యాదు


