ప్రేమించి పెళ్లి చేసుకుని వేధింపులు | - | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకుని వేధింపులు

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

మదనపల్లె టౌన్‌ : ప్రేమ పేరుతో తమను మోసం చేయడమే కాకుండా పెళ్లి చేసుకుని, ఇప్పుడు తనను కాదని తన చెల్లిని కూడా మోసం చేయడానికి యత్నిస్తున్న భర్త, అతని తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శేషమహల్‌ సమీపంలోని శారదానగర్‌కు చెందిన మాజీ సైనికుడు తులసి రాంప్రసాద్‌ రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె దివ్య (25), గీతిక(21) బెంగుళూరులో బీటెక్‌ చదువుతున్నారు. అలాగే శేషమహల్‌ ఏరియాలో కాపురం ఉంటున్న చలమయ్య కుమారులు రోహిత్‌, లోహిత్‌ సాయిలు కూడా బెంగళూరులోనే ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో ఒకే ఊరికి చెందిన వారు కావడంతో దివ్య మొదట రోహిత్‌తో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డట్లు తెలిపింది. పెద్దలను ఎదిరించి ఆరు నెలల క్రితం దివ్య రోహిత్‌ ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే గొడవలు తలెత్తి పరస్పరం ఒకరిపై మరొకరు స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా రోహిత్‌ తమ్ముడు లోహిత్‌ సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న దివ్య చెల్లెలు గీతికను ప్రేమించాలని వెంటపడుతున్నట్లు ఆరోపించారు. రోహిత్‌, లోహిత్‌ సాయిలు పబ్‌లకు తమను తీసుకెళ్లి మద్యం, మత్తుకు అలవాటు చేయించారని ఆరోపించారు. తమ బంగారాన్ని కూడా కుదవ పెట్టారని ఆరోపించారు. ఆ గొడవల్లో వన్‌ టౌన్‌ పోలీసులు రోహిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారనే కోపంతో.. లోహిత సాయి కూడా తన చెల్లెల్ని టార్గెట్‌ చేసి వేధింపులకు గురి చేయడమే కాకుండా కళాశాల వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు దివ్య వచ్చింది. గతంలో ప్రేమ పేరుతో తనను నమ్మించి మోసం చేశారని, తన చెల్లెలు గీతిక విషయంలోనూ అన్యాయం జరిగిందని ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ఎదుటే తీవ్ర భావోద్వేగానికి గురైన దివ్య, కుటుంబ సభ్యులు ‘మాకు న్యాయం చేయాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని పెట్రోల్‌ డబ్బాను తీసుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొద్దిసేపు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు బాధితురాలు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి ఫిర్యాదును పరిశీలిస్తున్నారు. తర్వాత దివ్య ఇంటికెళ్లి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీలో చికిత్స పొందుతోంది. ప్రేమ పేరుతో మోసం చేశారన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధిత కుటుంబం కోరింది.

న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం వేడుకోలు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట యువతి తండ్రి పెట్రోల్‌ పోసుకునే యత్నం

ఇంటికెళ్లి విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement