కేవీపల్లె : కుష్టువ్యాధి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని జిల్లా లెప్రసీ అధికారిణి రాధిక అన్నారు. గురువారం మండలంలోని గ్యారంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. లెప్రసీ కార్యక్రమాలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సేవలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీహెచ్‌సీ పరిధిలో లెప్రసీ కార్యక్రమాల అమలు, రోగులకు అందుతున్న సేవలు, పీహెచ్‌సీలో మందుల నిల్వ గూర్చి ఆరా తీశారు. వైద్యాధికారి డాక్టర్ హరి, పీహెచ్‌ఎన్ కృష్ణవేణి పాల్గొన్నారు.
ఐఐటీకి నిరుపేద విద్యార్థిని
బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం): మండలంలోని సూరపువారిపల్లికి చెందిన టి.నవదీపిక అనే నిరుపేద యువతి ఐఐటీ వారణాసికి ఎంపికై ంది. యువతి తండ్రి రమేష్ రెవెన్యూ గ్రామ సహాయకుడిగా (వీఆర్‌ఏ) పని చేస్తుండగా, తల్లి ఆదిలక్ష్మి దినసరి కూలి పనులు చేస్తుంది. సదరు యువతి నామాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, మదనపల్లి గురుకులంలో హైస్కూల్ వరకు, విజయవాడలోని గురుకులంలో ఇంటర్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో నవదీపికను ఉపాధ్యాయులు భాస్కర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, రెడ్డెప్పలు అభినందించారు.
రెడ్డెమ్మకొండలో వరుణ యాగం
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మ కొండ ఆలయంలో వర్షాలు కురువాల కోరుకొంటూ ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు వరుణ యాగం నిర్వహించారు. గురువారం ఉదయాన్నే ఆలయ మండపంలో శ్రీ మహాగణపతి పూజ నిర్వహించారు. మహాకలశస్థాపన కావించి శత కలశాభిషేకం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా యాగం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని అమ్మవారి పుష్కరణిలో ఉన్న మండపం వద్ద కలశాలను ఉంచి వరుణ జపం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శతకలశాభిషేకం, మహపుర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో భజన కళాకారులచేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయకమిటీ ఛైర్మెన్ రాజన్న నా యుడు, ఆలయ ఈవో మంజుల పాల్గొన్నారు.
నెట్వర్క్ ఆసుపత్రులున్నా రెఫర్ ఎందుకు చేస్తున్నారు
మదనపల్లె టౌన్: జిల్లాలో రూ.111 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ రోగులను ఇతర జిల్లాలకు రెఫర్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు కొనసాగించడంపై జిల్లా ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించి వైద్యులు, సూపరింటెండెంట్‌లను నిలదీశారు. జిల్లావ్యాప్తంగా 21 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని..ఇకపై అనవసర సిజేరియన్లు, ఇతర జిల్లాలకు రెఫర్లు చేయడం పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆసుపత్రి పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు.
ఇసుక డంప్
సాక్షి టాస్స్‌ఫోర్స్: పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో చాలా రోజులుగా ఇసుకను డంప్ చే సి ఉంచారు. ట్రాక్టర్ల ద్వారా పగటి వేళల్లో ఇసు కను తెచ్చి రాత్రి పూట టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకుని అక్రమ రవాణా అరికట్టాలని పలువురు కోరుతున్నారు.


