● పనుల నుంచి
ముగ్గురు డీఈఈలు తొలగింపు
● ఒక డీఈకి ఐదు డీఈల బాధ్యతలు
● పనులు ఒక డివిజన్‌వి..
అప్పగింత మరో డివిజన్‌కు
● మెకానికల్ అధికారులకు
సివిల్ పనులు అప్పగింత
సాక్షి, మదనపల్లె: ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఎవరికి సంబంధించిన విధులను లేదా పనులను సంబంధిత అధికారులే చేపట్టాలి..బాధ్యత వహించాలి..అయితే హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన మదనపల్లె సర్కిల్–3లో ఇష్టారాజ్యం నెలకొంది. ఒక డివిజన్ పరిధికి చెందిన విధులను మరో డివిజన్‌కు ఇచ్చేస్తున్నారు. ఒక డివిజన్‌లోని పనుల్లో మరో డివిజన్ అధికారుల పెత్తనం నడుస్తోంది. ఏ డివిజన్‌లో ఎవరు చేయాల్సిన పనులను వారికి అప్పగించడం లేదు. అధికారికంగా దక్కాల్సినవి కేటాయించడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ముగ్గురు డీఈఈలకు అప్పగించిన పనులను లాగేశారు. వీటిని మరో డీఈకి ఇచ్చేశారు. అసలు పనితో సంబంధం లేని డివిజన్లకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ఇక్కడి అధికారులకే సాధ్యమైంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పని విభజనలో పక్షపాతం
ప్రభుత్వం రూ.366 కోట్లతో పుంగనూరు ఉప కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులను గత ఏడాది చేపట్టింది. వీటిని పర్యవేక్షించి రికార్డు చేసేందుకు, విధుల నిర్వహణ కోసం కిలోమీటర్ల పరిధిలో డీఈలకు పర్యవేక్షణకు కిలోమీటర్ల అప్పగింతలోనే వివక్ష చోటుచేసుకుంది. కొందరికి కొంత ఇవ్వగా.. అయినవారికి అత్యధిక కిలోమీటర్లను కేటాయించడంతోనే ఇష్టారాజ్యానికి తెర లేచింది. ఇందులో డీఈ వెంకట ప్రతాప్‌కు 74 కిలోమీటర్ నుంచి 110 కిలోమీటర్ వరకు, తిరిగి 150 కిలోమీటర్ నుంచి 165 కిలోమీటర్ వరకు, డీఈ కృష్ణ కిషోర్ కు 110 కిలోమీటర్ నుంచి 142 కిలోమీటర్ వరకు, డీఈ రమణరావుకు 165 కిలోమీటర్ నుంచి 180 కిలోమీటర్ వరకు, డీఈ రవికి 180 కిలోమీటర్ నుంచి 195 కిలోమీటర్ వరకు, డీఈ సెల్వరాజ్ కు 195 కిలోమీటర్ నుంచి 207.800 కిలోమీటర్ పనులను అప్పగించారు. ఏడాదిగా ఈ పనులను ఈ డీఈలు బాధ్యతలను నిర్వర్తించారు.
ఆ ముగ్గురిని తొలగిస్తూ...
తాజాగా పుంగనూరు ఉపకాలువ పనుల విధులు నిర్వహిస్తున్న కుప్పం డివిజన్–12కు చెందిన రమణారావు (పలమనేరు), రవి (వి.కోట), సెల్వరాజ్ (కుప్పం)లకు అప్పగించిన విధుల నుంచి తొలగించి వారికి కేటాయించిన కిలోమీటర్లను రద్దు చేశారు. మిగతా వారితో పోలిస్తే ఈ ముగ్గురికి అతితక్కువ కిలోమీటర్లు ఇచ్చారు. అయినప్పటికీ అది కూడా లేకుండా తొలగించేశారు. వాస్తవానికి డివిజన్–12కు చెందిన ఈ ముగ్గురు డీఈలకే కిలోమీటర్ 165 నుంచి కిలోమీటర్ 207.800 వరకు అప్పగించాలి. అయితే అయినవారి కోసమో లేక తెర వెనుక ఏ మంత్రాంగం నడిచిందో ఉన్నఫళంగా పనులను పీకేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డీఈ వెంకటప్రతాప్. ఆయనకు 51 కిలోమీటర్ల పరిధిని కేటాయించారు. ఈయనకు కేటాయించిన కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్‌కు కోతలేదు, పైగా ఆయన విధులవైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. ఇది ప్రాజెక్టు అధికారుల్లో చర్చకు దారితీస్తోంది.
ఒక డీఈకే ఐదు బాధ్యతలు
పుంగనూరు ఉప కాలువ పనులు చూస్తున్న ముగ్గురు డీఈల నుంచి తొలగించిన పనులను కదిరి డివిజన్–9లో మెకానికల్ డీఈ గా పనిచేస్తున్న కృష్ణ కిషోర్ కు అప్పగించారు. ఇప్పటికే కృష్ణ కిషోర్ కు ఇదే కాలువలో కిలోమీటర్ 110 నుంచి 142 వరకు పనులను అప్పగించారు. ఇప్పుడు పనుల నుంచి తొలగించిన ముగ్గురు డీఈలకు సంబంధించిన పనులన్నీ అదనంగా అప్పగించారు. ఈయన కదిరి డివిజన్–9లో మెకానికల్ డీఈతో పాటు కదిరి డివిజన్–11 లోని ఓ డీఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈయన ఒక్కరికే ఐదుగురు డీఈల బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. ఈ అధికారికి ఇన్నేసి బాధ్యతలను అప్పగించడం వెనుక కారణమేమై ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ప్రాజెక్టులోని ఇంజినీరింగ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
డివిజన్నే మార్చేశారు
ఉన్నతాధికారులు అనుకుంటే ఏమైనా చేయొచ్చనే దానికి హంద్రీనీవా ప్రాజెక్టులో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. కుప్పం ఉపకాలువ కాంక్రీట్ లైనింగ్ పనులు డివిజన్ నంబర్–12 పరిధిలోకి వస్తుంది. దీనికి ఒక ఈఈ, డీఈలు ఉన్నారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 165 నుంచి 207 కిలో మీటర్ వరకు డివిజన్–12 పరిధిలోకి వస్తుంది. అంటే ఈ డివిజన్‌కు చెందిన ఈఈ దీని పర్యవేక్షణ చేయాలి. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఇంకోలా నిర్ణయించారు. మెకానికల్ విభాగానికి చెందిన కదిరి డివిజన్–9కి ఈఈకి పని బాధ్యత బదలాయించారు. దీంతో అక్కడి ఈఈ రాజగోపాల్‌కు వీటి పనుల పర్యవేక్షణ బాధ్యతలు దక్కాయి. డివిజన్–12 ఈఈ పరిధిలోని పనిని మార్చేయగా ఇప్పుడు డివిజన్–12కు చెందిన డీఈలకు ఉన్న పనుల బాధ్యతల నుంచి కూడా తప్పించేశారు.
పుంగనూరు ఉపకాలువలో కాంక్రీట్ లైనింగ్ పనులు ఇంకా మిగిలి ఉండగా, స్ట్రక్చర్స్ పనులు ఇంకా మొదలు పెట్టలేదు. స్ట్రక్చర్స్ లో అండర్ టన్నెల్, సూపర్ ప్యాసేజ్, బ్రిడ్జిలు, ఇన్ లెట్లు, అవుట్ లెట్లు, ఓటీలు, క్రాస్ ఎక్స్ లెటర్లు, ఎస్కేప్ లో తదితర పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంది. వీటి బాధ్యతల పర్యవేక్షణను తామే చేయాలని, తమకే అప్పగించాలని కొందరు అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కీలకపాత్ర వహించి ఇలా ఇష్టారాజ్యంగా పనులు అప్పగింతపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా పుంగనూరు ఉపకాలువలో కాంక్రీట్ లైనింగ్ పనుల నాణ్యతను నీటి ప్రవాహం చెప్పకనే చెప్పింది. లైనింగ్ కొట్టుకుపోయినా ఇప్పటికీ చర్యలు తీసుకోని అధికారులు పనుల అప్పగింత విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం.


