రాయచోటి టౌన్ : శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. తాగేందుకు మంచినీరు లేదు, మధ్యాహ్నం కడుపునకు సరిపడా భోజనం పెట్టలేదు, మధ్యలో ఇవ్వాల్సిన స్నాక్స్ అసలే లేదు.. ఇదేమని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వెటకారపు మాటలు. దీంతో చేసేది లేక చాలీచాలని భోజనంతో అర్ధ కడుపు నింపుకొన్న వారు కొందరైతే.. అసలే అన్నం లేకుండా వెళ్లిన ఉపాధ్యాయులు మరికొందరు. వివరాల్లోకి వెళ్లితే.. రాయచోటిలోని మాసాపేట సుగవాసి రాజారాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు 1, 2వ తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై 6 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇందులో 600 మందికి పైగా పాల్గొంటున్నారు. వీరికి టీ, స్నాక్స్‌తోపాటు మధ్యాహ్నం భోజనం అందించేందుకు ప్రభుత్వం ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రూ.300 చొప్పున అందించి ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ మరో కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్ట్ రూ.140లకు అంటే సగానికి కన్నా తక్కువ డబ్బులకు అప్పగించారు. ఈ సబ్ కాంట్రాక్టర్ అందుకు తగిన విధంగానే భోజనాలు తెచ్చిపెట్టారు. ఇది సగం మందికి కూడా సరిపోవడం లేదు. మరో రూ.100తో స్టేషనరీ కూడా అందించాల్సి ఉంది.
అధికారుల పర్యవేక్షణ కరువు
ఉదయం టీ, టిఫిన్ అంతంత మాత్రంగా అందిస్తున్నా... కనీసం మధ్యాహ్నం అయినా కడుపు నిండా భోజనం పెడతారంటే.. అది కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఉదయం టీ, టిఫిన్ సరిగా ఇవ్వకపోతే పోతిరి కనీసం మధ్యాహ్నం భోజనం అయినా పెట్టాలి కదా అని ప్రశ్నిస్తే.. మీకు దిక్కున్న చోట చెప్పుకోపోండి.. అంటూ వెటకారపు సమాధానాలు చెప్పడంతో ఉపాధ్యాయులు ఆవేదనకు గురయ్యారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వకపోవడంతో తమకు తాము ఇళ్ల దగ్గర నుంచి మంచినీళ్ల బాటిళ్లు తెచ్చుకోవడంతోపాటు కొందరు విరామ సమయంలో బయటి నుంచి తెప్పించుకొన్నారు. మధ్యాహ్నం భోజనం వడ్డించే సమయంలో వీరికి ఎండ తాపం నుంచి తప్పించేందుకు షామియానాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో.. వారి వద్ద ఉన్న విస్తర్లనే గొడుగుల్లా మార్చుకొన్నారు. కొసమెరుపు ఏమిటంటే గతంలో ఇలాంటి శిక్షణలు చాలా జరిగాయి కానీ ఇలాంటి ఇబ్బందులు లేవని ఉపాధ్యాయులే చెప్పడం గమనార్హం. ఇంతా జరుగుతున్నా ఇటు వైపు విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని, దీంతో తాము ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల శిక్షణ సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన భోజనం ఏర్పాట్లలో ఆలస్యం అయ్యిందన్న విషయం వాస్తమేనని రాయచోటి మండల విద్యాశాఖాధికారి బాలాజీ నాయక్ తెలిపారు. రాయచోటి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,2 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు రెండు రోజులుగా ఎఫ్‌ఎల్‌ఎస్ శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ముందుగా నిర్ణయించిన మండలాల కంటే మరికొన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులు రావడం వల్ల భోజనం కొరత ఏర్పడిందన్నారు. వెంటనే కాంట్రాక్టర్‌కు ఆదేశించి మరో 20 నిమిషాలలో భోజనం తెప్పించామన్నారు. ఆలస్యమైన 15–20 మధ్యలో కొంత మంది ఉపాధ్యాయులు భోజనం కొరత ఏర్పడిందని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మున్ముందు నిర్వహించే కార్యక్రమాలకు వసతి ఏర్పాట్లలో ఎలాంటి కొరత రానివ్వరాదని కాంట్రాక్టర్‌ను హెచ్చరించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల శిక్షణలో
సౌకర్యాలు కరువు
అరకొరగా టీ, టిఫిన్, భోజనం
ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండంటూ వెటకారపు మాటలు
భోజనం ఆలస్యం అయింది నిజమే : ఎంఈవో
ప్రభుత్వం ప్రతి ఉపాధ్యాయుడికి రూ.300 చొప్పున భోజనాల కోసం ఇస్తోంది. అయితే నిర్వాహకులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెనూ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన భోజనాలు ఇవ్వడం లేదు. అసలే ఎండలు మండిపోతున్నాయి. కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదు. అధికారులు దీనిపై పర్యవేక్షణ చేసి తరువాత శిక్షణ జరిగే రోజుల్లో సౌకర్యాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలి.
– శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు,
పీఎస్‌టీయూ


