ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ను సస్పెండ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ను సస్పెండ్‌ చేయాలి

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

రాయచోటి : ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసరాజును సస్పెండ్‌ చేసి, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్‌ దాస్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాయచోటిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసరాజు కాలపరిమితి ముగిసినప్పటికీ డిప్యుటేషన్‌ పేరుతో మూడు సంవత్సరాల నుంచి అక్రమంగా పదవిలో కొనసాగుతూ.. జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ వ్యవస్థను అవినీతిమయం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్‌ స్కూల్‌ పరిధిలో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా ఎండగట్టారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులు, ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అర్హత లేని వారికి నకిలీ పత్రాలు సృష్టించి అడ్మిషన్లు కల్పిస్తున్నారని విమర్శించారు. కనీసం పీసీపీ తరగతులకు ముఖం చూపించని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని, వారు క్లాసులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో కీలకమైన ఇరవై శాతం అంతర్గత మార్కులు (ట్యూటర్‌ మార్కడ్‌ అసైన్‌మెంట్లు) ఇచ్చే ప్రక్రియను ఒక పెద్ద దందాలా మార్చి.. విద్యార్థుల నుంచి ఖాళీ పేపర్లు తీసుకొని లంచాలు వసూలు చేస్తూ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పూర్తి మార్కులు వేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దశల వారీగా పోరాటాలు

కడప హరిత హోటల్‌లో గురువారం జరిగిన ఒక పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమానికి.. ప్రభుత్వ అధికార హోదాలో ఉన్న శ్రీనివాసరాజు హాజరు కావడాన్ని కిషోర్‌ దాస్‌ తీవ్రంగా ఖండించారు. ఒక ప్రభుత్వ అధికారిగా సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన స్థాయి, పరిధిని మరచి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై శ్రీనివాసరాజు దుర్మార్గపు ఆరోపణలు చేయడం ఆయన మతిభ్రమించిన తనానికి నిదర్శనమన్నారు. శ్రీనివాసరాజు తన వ్యాఖ్యలపై వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకత్వానికి, కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసారు. రాజకీయాలు చేయాలనే మోజు ఉంటే వెంటనే తన కో–ఆర్డినేటర్‌ పదవికి, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరి పచ్చ కండువా కప్పుకొని బహిరంగంగా రాజకీయ ప్రసంగాలు చేసుకోవచ్చని హితవు పలికారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన శ్రీనివాసరాజును విధుల నుంచి తొలగించి ఆయన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అందులో భాగంగా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తరువాత అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశం ఏర్పాటు చేసి శ్రీనివాసరాజును తొలగించే వరకు నిరంతర పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్దుల్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థుల నుంచి అక్రమంగా వసూళ్లు

టీడీపీ సమావేశంలో శ్రీనివాసరాజు పాల్గొనడం చట్టవిరుద్ధం

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్‌ దాస్‌

Advertisement
 
Advertisement
Advertisement