ఇన్‌చార్జ్‌ పాలన ఇంకెన్నాళ్లు..!? | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌ పాలన ఇంకెన్నాళ్లు..!?

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : నగర శివారులోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ అధికారుల పాలన కొనసాగుతోంది. గత రెండేళ్ల కిందట లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డిని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్‌ ఆరు నెలల పాటు సేవలు అందించారు. ఆ తర్వాత చిత్తూరు డీటీసీ నిరంజన్‌రెడ్డి నాలుగు నెలలు అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం డీటీసీగా ఉన్న వీర్రాజు 2025 సెప్టెంబర్‌ నుంచి ఇన్‌చార్జ్‌ డీటీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారంలో బుధ, గురువారాల్లో మాత్రమే రవాణా శాఖ కార్యాలయంలో వాహన యజమానులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. వారం రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను ఇన్‌చార్జ్‌ డీటీసీ మొత్తం పూర్తి చేసి వెళుతున్నారు. మిగిలిన రోజులో డీటీసీ లేకపోవడంతో వాహనదారులకు పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత రవాణా శాఖ కార్యాలయంలోని సిబ్బందిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. దీంతో ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఒక డీటీసీ, ఎంవీఐ ఒకరు, ఏ ఎంవీఐలు ముగ్గురు, ఏఓలు ఇద్దరు, సీనియర్‌ అసిస్టెంట్‌లు ముగ్గురు, జూనియర్‌ అసిస్టెంట్‌లు ముగ్గురు ఉండాలి. అయితే ప్రస్తుతం డీటీసీ లేకపోగా ఏంవీఐ ఒకరు, ఏఎంవీఐలు ఇద్దరు, ఏవోలు ఇద్దరు, సీనియర్‌ అసిస్టెంట్‌లు ఇద్దరు, జూనియర్‌ అసిస్టెంట్‌లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు సెలవుపై వెళ్లినా పనులు సకాలంలో జరగక పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇన్‌చార్జ్‌ డీటీసీ లేని సమయంలో వాహనదారులకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ పరిధిలో ఉన్న పనులను ఎంవీఐ, ఏ ఎంవీఐలు చేస్తున్నారు. డీటీసీ పరిధిలో ఉన్న పనులు పెండింగ్‌లో ఉండక తప్పడం లేదు. జిల్లాలోని నాలుగు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలలో సిబ్బంది కొరతతో అగచాట్లు పడుతున్నా రు. రవాణా శాఖ అధికారులు రెగ్యులర్‌ డీటీసీని నియమించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు లెటర్లు రాసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా రవాణా శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయానికి రెగ్యులర్‌ డీటీసీని నియమించాలని వాహనదారులు కోరుతున్నారు.

రెగ్యులర్‌ డీటీసీ లేక వాహనదారులకు ఇక్కట్లు

రెండేళ్లుగా భర్తీ కాని పోస్టు

వారంలో రెండు రోజులు మాత్రమే సేవలు

Advertisement
 
Advertisement
Advertisement