కలకడ : జిల్లాలోని అన్ని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే సమయానికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి తేజశ్విని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కె.బాటవారిపల్లె పంచాయతీ బీసీ కాలనీ సమీపంలోని బీసీ హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో 38 బీసీ హాస్టల్‌లు ఉండగా కేవలం 26 కేంద్రాలకు మాత్రమే శాశ్వత భవన సదుపాయం ఉండగా, 12 ప్రైవేటు వ్యక్తుల గదులను అద్దెకు తీసుకుని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వాటిలో జూన్–12 నాటికి కనీస సౌకర్యాలు అయిన నీరు, నీడ, విశ్రాంతి గదులలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు అందినా సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బీసీ హాస్టల్ కాంపౌడ్ పరిధిలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మనోజ్‌కుమార్, డిప్యూటి ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ సుజాత, సాంకేతిక సహాయకులు సురేంద్ర, నాగవేణి, హాస్టల్ వార్డెన్ సుబ్బరామయ్య, పంచాయతీ అభివృద్ధి అధికారిణి నందిని, ఉపాధి హామీ పథకం మేట్ ఓబులేశు, అమరనాథ్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలికిరి : వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు కలికిరి పట్టణంలో శుక్రవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు శనివారం అక్రమంగా కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్, రవాణాకు అంతరాయం, తాము వద్దన్నా వినకుండా కార్యక్రమం చేపట్టారన్న అభియోగాలతో బీఎన్‌ఎస్ 223, 292, 192 ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్‌ల కింద కానిస్టేబుల్ సుబ్బరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చింతల రమేష్‌కుమార్‌రెడ్డి, నాయకులు రత్నశేఖర్‌రెడ్డి, ఆర్.మధుసూదన్‌రెడ్డి, ఎస్టీడీ హరి, శామ్యూల్, నరేష్, హనీఫ్, ద్వారకనాథరెడ్డి, సహదేవ, గోపాల్, రాహుల్ చక్రవర్తిరెడ్డితోపాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు.
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థత
చౌడేపల్లె : పాము కాటుకు గురై వ్యక్తి అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం జరిగింది. మండల కేంద్రంలోని ప్రైవేటు బస్టాండులో సుబ్రమణ్యం చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు శబరీష్(39) విక్రయదారుకోసం దుకాణంలో సరుకులు తీసే క్రమంలో నాగుపాము కాటేసింది. పాము కాటును గుర్తించిన అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దుకాణంలోని నాగుపామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలడానికి తీసుకెళ్లారు.


