రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

రెండు లారీలు ఢీకొని దగ్ధం

మదనపల్లె టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం చెందిన విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. పీటీఎం మండలం పిడింవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండా ఉదయ్‌ కుమార్‌(20) తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా, కురబలకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్‌ అదుపు తప్పి పడి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. యువకుడి మృతితో పిడింవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పుంగనూరు : పుంగనూరు మండలంలోని సుగాలిలలిమెట్ట వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటన శుక్రవారం రాత్రి 11 గంటలకు జరిగింది. చైన్నె వైపు వెళ్తున్న ఒక లారీ.. అనంతపురం వైపు వెళ్తున్న మరో లారీ సుగాలిమిట్ట వద్దకు రాగానే ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు లారీల్లో మంటలు చెలరేగడంతో లారీలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్లకు, క్లీనర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధం కావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement