బాల్యాల బంధం.. గర్భాల భారం ! | - | Sakshi
Sakshi News home page

బాల్యాల బంధం.. గర్భాల భారం !

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

జిల్లాలో యథేచ్ఛగా బాల్య వివాహాల జోరు పెరుగుతున్న టీనేజ్‌ గర్భిణుల సంఖ్య

తగ్గుతున్న సాధారణ గర్భధారణల శాతం 6,441 మంది హైరిస్క్‌ గర్భిణులు

మదనపల్లె టౌన్‌: జిల్లాలో గర్భిణీ మహిళల ఆరోగ్య స్థితిగతులపై అందుతున్న గణాంకాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో మూడేళ్లుగా మొత్తం గర్భధారణల నమోదు శాతం గణనీయంగా తగ్గుతుండగా, మరోవైపు 18 ఏళ్ల లోపు (టీనేజ్‌) గర్భం దాల్చుతున్న వారి సంఖ్య మరియు హైరిస్క్‌ కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లోపించడం, మౌలిక వసతుల కొరత కారణంగా జిల్లాలో మాతా శిశు సంరక్షణ కుంటుపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పడిపోతున్న గర్భిణుల నమోదు

జిల్లాలో మొత్తం గర్భిణుల నమోదు సంఖ్య గడిచిన ఏడాదిలోనే 12.4% మేర పడిపోయింది. 2024–25లో 30,095 మంది నమోదైతే, 2025–26 నాటికి ఆ సంఖ్య 26,356 కి తగ్గింది. ఒకే సంవత్సరంలో 3,739 గర్భధారణలు తగ్గడం వెనుక జిల్లాలో జననాల రేటు తగ్గడం లేదా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నమోదు ప్రక్రియలో లోపాలు ఉండవచ్చని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నలుగురిలో ఒకరు ‘హై రిస్క్‌’ కేటగిరీలోనే..

చిన్న వయసు ప్రసవాల కారణంగా జిల్లాలో సమస్యలతో కూడిన ‘హై రిస్క్‌’ గర్భధారణల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జిల్లాలో నమోదవుతున్న గర్భిణుల్లో ప్రతి ఏటా 21% నుండి 24% మంది హై రిస్క్‌ కేటగిరీలోనే ఉంటున్నారు. 2024–25లో అత్యధికంగా 7,085 హైరిస్క్‌ కేసులు నమోదు కాగా, 2025–26 లో 6,441 కేసులు నమోదయ్యాయి. గర్భిణులలో తీవ్ర రక్తహీనత, హైబీపీ, షుగర్‌ వ్యాధి మరియు తక్కువ వయసులోనే గర్భం దాల్చడం వంటివి ఈ ప్రమాదకర స్థితికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

అందుబాటులో 3 ఆసుపత్రులే

జిల్లాలో ఏకంగా 6,441 మంది గర్భిణులు అత్యంత ప్రమాదకరమైన ‘హై రిస్క్‌’ కేటగిరీలో ఉంటే, వీరికి అత్యవసర వైద్యం అందించడానికి జిల్లా మొత్తం మీద ఫస్ట్‌ రెఫరల్‌ యూనిట్లు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. మదనపల్లె, రాయచోటి, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సదుపాయం ఉండటంతో పాటు, అక్కడ గైనకాలజిస్టులు, పీడియాట్రీషియన్లు వంటి స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

68 శాతానికే పరిమితమైన చెకప్స్‌..

కుంటుపడుతున్న లక్ష్యాలు

గర్భిణులకు క్రమం తప్పకుండా చేయాల్సిన యాంటీనాటల్‌ కేర్‌ చెకప్స్‌ జిల్లాలో కేవలం 68 శాతం మాత్రమే జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు ఏఎన్‌ఎంలు రెగ్యులర్‌గా వెళ్లడం లేదని, ఫలితంగానే చెకప్‌ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన కీలక లక్ష్యాలైన..టీనేజ్‌ ప్రెగ్నెన్సీలను 5 శాతం లోపుకు తగ్గించడం, 100 శాతం ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలు (ఆసుపత్రి కాన్పులు) చేయడం, మరియు మాతృ మరణాల రేటును 70 లోపునకు పరిమితం చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం స్పష్టంగా బయటపడుతోంది. గత 2023–24లో 12 మాతృ మరణాలు నమోదు కాగా, 2024–25 నాటికి ఆ సంఖ్య 6కి తగ్గింది. అయితే ప్రస్తుత 2025–26 సంవత్సరంలో ఇప్పటివరకు 7 మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా, జాతీయ ప్రమాణాలతో పోలిస్తే జిల్లాలో ఎంఎంఆర్‌ ఇంకా ఎక్కువగానే ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా జిల్లాలో గర్భిణీల నమోదు శాతం తగ్గకుండా ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు చేపడతాం. చిన్న వయసు గర్భధారణలు, హైరిస్క్‌ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement