నాటు బాంబులు..హడలిపోతున్న ప్రజలు | - | Sakshi
Sakshi News home page

నాటు బాంబులు..హడలిపోతున్న ప్రజలు

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

ఎస్‌ఐ ఏమన్నారంటే..

దుర్గసముద్రం సమీపంలోని మామిడితోటలో నల్లమందు ఉంట కొరికి గాయపడిన పెంపుడు కుక్క (ఫైల్‌)

అటవీ ప్రాంతంలో వేట గాళ్లు ఏర్పాటు చేసిన నల్లమందు ఉంట (ఫైల్‌)

వేటగాళ్ల చేతిలో చిక్కి విక్రయించేందుకు తెచ్చిన కుందేలు(ఫైల్‌)

చౌడేపల్లె : గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, అటవీ ప్రాంతం సమీపంలోని గుట్టలు, వంకల్లో వేటగాళ్లు సరికొత్త ఆలోచనలతో వన్యమృగాలను మట్టుపెడుతున్నారు. అడవి పందుల కోసం నాటు తుపాకీలే కాకుండా నల్లమందు ఉంటలు, ఉర్లు అమర్చడం వల్ల.. అటవీ జంతువుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లోని పొలాల్లోకి, పరిసరాల్లోకి వెళ్లడానికి సైతం ప్రజలు భయపడుతున్నారు. మండలంలోని దుర్గసముద్రం, ముదిరెడ్డిపల్లె, చుక్కావారిపల్లె, పందిళ్ళపల్లె, ఆమినిగుంట, మడుకూరు, గాజులవారిపల్లె, పరికిదొన, చెడుగుట్లపల్లె, కొలింపల్లె, మాదంవారిపల్లె, షికారిపాళ్యం, సీజేఎఫ్‌ఎస్‌ కాలనీ, బండమీదపల్లె, సింగిరిగుంట, చారాల, బుటకపల్లె, దుర్గసముద్రం, నాగిరెడ్డిపల్లె తదితర అటవీ ప్రాంతాల సమీపంలో గల గ్రామాల పరిసర ప్రాంతాల్లో అడవి పందులే కాకుండా అటవీ మృగాలను చంపేస్తున్నారు. ఇటీవల జరిగిన నాటుబాంబు పేలుళ్ల కారణంగా పెంపుడు కుక్కతోపాటు పాడిఆవులు మృతి చెందాయి. పాడి ఆవులు మేత కోసం వెళ్లిన సమయంలో అక్కడ పడి ఉన్న ఉంటలను మేతతోపాటు కొరికేందుకు ప్రయత్నించి మృత్యువాత పడిన సంఘటలు ఉన్నాయి. అటవీ సంపద, వన్యప్రాణాలను రక్షించాల్సిన అటవీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో.. వేటగాళ్ల తూటాలకు, నాటు బాంబులకు(నల్లమందు ఉంటలకు) బలవుతున్నాయి. వీటితోపాటు వలలు, ఉర్లు ఏర్పాటు చేసి అడవి పందులు, కుందేళ్లు, కంజులు, పూరేడి గువ్వలను సైతం పొట్టనపెట్టుకొంటున్నారు. అడవులలో వేటగాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు అటవీ జంతువులు ఏకంగా జనారణ్యంలోని పరుగులు తీస్తున్నాయి. గతంలో బోయకొండ, చుక్కావారిపల్లె పరిసర ప్రాంతంలో ఓ దుప్పి వేటగాళ్ల దాడిలో తూటాలకు బలైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అటవీ జంతువుల మాంసం విక్రయాల వ్యాపారం మూడు పువ్వలు ఆరుకాయలుగా సాగుతోంది. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు, పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతోపాటు ఆ దిశగా విచారణ సైతం చేపట్టకపోవడం గమనార్హం. కొందరు దర్జాగా విందు భోజనాలు సైతం ఏర్పాటు చేసుకొని మద్యం మత్తులో చిందులేస్తున్నారని, వారికి అధికారుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు వైపుగా పంట పొలాలకు వెళ్లే రైతులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. వన్యప్రాణులను కాపాడుకోవడానికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు వ్యయం చేస్తున్నా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అటవీ ప్రాణులను చంపడం, పేలుడు పదార్థాలు వాడటం చట్టరీత్యానేరం. గ్రామీణ ప్రాంతాల్లో నల్లమందు ఉంటల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. విచారణ చేసి, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. వీటితోపాటు నాటుతుపాకులు, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలి. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – చిన్నరెడ్డెప్ప, ఎస్‌ఐ, చౌడేపల్లె

వేటగాళ్ల తూటాలకు బలవుతున్న అటవీ మృగాలు

అడుగు పెట్టడానికి భయపడుతున్న జనం

అడవి పందుల కోసం ఉంటలతో దాడులు

ప్రాణాలు కోల్పోతున్న కుందేళ్లు,

జింకలు, దుప్పులు

Advertisement
 
Advertisement
Advertisement