మదనపల్లె సిటీ : వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలతో నిత్యం కళకళలాడే ముహూర్తాల సీజన్‌కు తాత్కాలికంగా విరామం పడింది. తిరుగులేని శుభ ముహూర్తాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా పెళ్లి బాజాలు మూగబోయాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరుతో పాటు పలు మండల కేంద్రాల్లో వందలాది కల్యాణ మండపాలు ఉన్నాయి. సాధారణంగా ఈ కేంద్రాల్లో నెలకు సుమారు 200కు పైగా వివాహాలు జరుగుతుంటాయి. అయితే, అధిక జ్యేష్టమాసం రావడంతో గత నెల 14 నుంచి ఈ నెల 18 వరకు వివాహాది ప్రధాన శుభకార్యాలకు పూర్తిగా బ్రేక్ పడింది.‘మూఢమి’ కారణంగా వాయిదాలు
వేద పండితుల ప్రకారం మే 14 నుంచి జూన్ 18 వరకు ఉన్న కాలాన్ని ‘మూఢమి’ (శూన్యమాసం)గా పరిగణిస్తారు. ఈ కాలంలో ఎలాంటి పెద్ద శుభకార్యాలు తలపెట్టకూడదనే నియమం ఉంది. అందుకే జనాలు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి ప్రధాన వేడుకలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్లు వంటి సాధారణ కార్యక్రమాలను మాత్రం యథావిధిగా నిర్వహించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు.
అనుబంధ రంగాల్లో మందగమనం
ముహూర్తాలు లేకపోవడంతో వివాహ వేడుకలపై ఆధారపడి జీవించే వందలాది అనుబంధ రంగాలు, వృత్తుల వ్యాపారం తాత్కాలికంగా మందగించింది. కల్యాణ మండపాలు, కేటరింగ్ సర్వీసెస్, టెంట్ హౌస్‌లు, డెకరేషన్ నిర్వాహకులు, పూల వ్యాపారులు, జ్యువెలరీ షాపులు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, హోటళ్లు మరియు లాడ్జీల వ్యాపారాలపై ఈ శూన్యమాసం ప్రభావం తీవ్రంగా పడనుంది. వ్యాపారాలు లేక సిబ్బందికి ఉపాధి కరువైంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకుంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
19 నుంచి మళ్లీ సందడి
ఈ నెల 19న ‘నిజ జ్యేష్టమాసం’ ప్రారంభం కావడంతో మళ్లీ జిల్లాలో శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనువైన తేదీలున్నాయి. వీటితో పాటు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనూ పలు శుభముహూర్తాలు లైన్ కట్టాయి.
18 వరకు నిలిచిపోనున్న పెళ్లి బాజాలు!
అడ్డుగా మారిన అధిక జ్యేష్టమాసం (మూఢమి)
బోసిపోతున్న కల్యాణ మండపాలు.. ఉపాధి కోల్పోతున్న అనుబంధ
రంగాలు
19 నుంచి మళ్లీ ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సందడి


