మదనపల్లె టౌన్ : కురబలకోట మండలం చేనేతనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం రామాచర్లపల్లికి చెందిన ఆదమ్మ (55), పవిత్ర (24), రామలక్ష్మి (45), ఎస్.ఎస్.విని (5), పుంగనూరు మండలం పందిళ్లవారిపల్లికి చెందిన శ్రీనివాసులు (47), మదనపల్లె ఎస్టేట్‌లోని సత్యసాయి కాలనీకి చెందిన సుల్తాన్ (22) ఆటోలో బి.కొత్తకోటలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా, కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఐసర్ లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. కలకడ మండలం ,కె.బాటవారిపల్లె గ్రామానికి చెందిన పెద్దకోట్ల కృష్ణయ్య (70) చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఉన్న కేఎస్‌ఆర్ కాంప్లెక్స్ వద్ద వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణయ్యకు భార్య, నాగరత్న, కుమారుడు అశోక్, కుమార్తె నళిని ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఆరుగురికి గాయాలు


