జనాభా లెక్కల పేరిట సైబర్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

జనాభా లెక్కల పేరిట సైబర్‌ మోసాలు

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

మదనపల్లె టౌన్‌ : ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారని, ప్రస్తుతం జనాభా లెక్కల (సెన్సెస్‌) పేరుతో సాగుతున్న సైబర్‌ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దీరజ్‌ పేర్కొన్నారు. గురువారం మదనపల్లెలోని జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.ఇటీవలి కాలంలో సైబర్‌ కేటుగాళ్లు జనాభా లెక్కల నమోదు అధికారులమంటూ ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ లు, వాట్సాప్‌ లింకుల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిజిటల్‌ సర్వే చేస్తున్నామని నమ్మిస్తూ.. ఆధార్‌ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి, ఆపై మీ మొబైల్‌ నంబర్లకు వచ్చే ఓటీపీలను అడిగి క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఎన్నడూ ఫోన్లలో గానీ, అనుమానాస్పద లింకుల ద్వారా గానీ బ్యాంక్‌ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్‌ నంబర్లు అడగరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మొబైల్‌ ఫోన్లకు వచ్చే ఎటువంటి అపరిచిత లింకులపై క్లిక్‌ చేయవద్దని, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్‌ మాయగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే టోల్‌ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత వేగంగా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి

రామసముద్రం : బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించి.. న్యాయం అందించడమే పోలీసుల బాధ్యత అని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం రామసముద్రం పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్‌ స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రామసముద్రం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున అక్రమ రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేర చరితులపై నిఘా పెట్టామని తెలిపారు.కార్యక్రమంలో సీఐ రవి నాయక్‌, ఎస్‌ఐ హృషికేశవరెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ ధీరజ్‌

Advertisement
 
Advertisement
Advertisement