మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మగ్గాల నిర్వాహకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. నీరుగట్టువారిపల్లిలోని చౌడేశ్వరిదేవి గుడి రెండో వీధిలో నివాసం ఉంటున్న బి.జయరాం (37) స్వస్థలం రాయచోటి బట్లపల్లి. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో మదనపల్లెకు వచ్చి నీరుగట్టుపల్లిలో స్థిరపడ్డాడు. భోజనపు శ్రీరాములుకు రవిచంద్ర, వెంకటరత్నం, జయరాం ముగ్గురు కుమారులు కాగా అందరూ వేర్వేరుగా స్థిరపడ్డారు. జయరాం ఇంట్లోనే 20 వరకు మగ్గాలు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో భార్య రుక్మిణి, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో వారం క్రితం రుక్మిణి పిల్లలతో కలిసి బెంగళూరులోని యలహంకకు వెళ్లిపోయింది. ఇంట్లో ఒంటరిగా మిగిలిన జయరాం జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ మహమ్మద్ రఫీ, ఎస్‌ఐ రామాంజనేయులు, ఏఎస్‌ఐ మహాదేవ, రమణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీ నుంచి పరిశీలించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి, అన్నదమ్ములు, భార్యను పిలిపించిన పోలీసులు వారి సమక్షంలోనే తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


