తంబళ్లపల్లె: సంప్రదాయ పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న అన్నమయ్య జిల్లా రైతులకు ‘అవతార్’ రకం ఔషధ చిన్న ఉల్లిగడ్డల సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. నిరంతరం నష్టాలు తెచ్చే టమాట, వేరుశనగ పంటల స్థానంలో ఇక్కడి రైతులు కొత్త రకం సాగువైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితోనే అత్యధిక నికర ఆదాయాన్ని సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తంబళ్లపల్లె మండలంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉల్లి సాగు యథేచ్ఛగా సాగుతోంది.
టమాట నష్టాల నుంచి.. ‘అవతార్’ లాభాల వైపు!
తంబళ్లపల్లె మండలం పరసతోపు పంచాయతీ నాయనప్పగారిపల్లెకు చెందిన రైతు అమరనాథరెడ్డి గతంలో టమాట పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తోటి ఆదర్శ రైతుల సలహాతో ఆయన సరికొత్త ప్రయోగం చేశారు. తమిళనాడు నుంచి కిలో రూ. 13 వేల చొప్పున వెచ్చించి ‘అవతార్’ రకం ఔషధ చిన్న ఉల్లిగడ్డల విత్తనాలు తెచ్చి నారు పోశారు. 40 రోజుల తర్వాత ఆ నారును ఒకటిన్నర ఎకరం పొలంలో నాటగా, కేవలం 85 రోజుల్లోనే పంట దిగుబడి చేతికొచ్చింది. పొలంలో కలుపు లేకుండా చూసుకుంటూ, కేవలం ఒకే ఒక్కసారి యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేసి, డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని అందిస్తూ నాణ్యమైన దిగుబడి సాధించారు.
ఎకరాకు 11 టన్నుల దిగుబడి..
తోట వద్దే వ్యాపారుల తాకిడి!
విత్తనాలు కొనడం దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల వరకు పెట్టుబడి అయినట్లు రైతు తెలిపారు. ప్రస్తుతం తోటలో పంట దిగుబడి ప్రారంభం కాగా, ఎకరాకు 10 నుంచి 11 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెటింగ్‌కు వెళ్లాల్సిన పని లేకుండా వ్యాపారులే నేరుగా తోటల వద్దకు వచ్చి కిలో రూ. 30 నుంచి రూ. 35 వరకు చెల్లించి కొనుగోలు చేస్తుండటం విశేషం.
శ్రీలంక, మలేషియా, దుబాయ్‌లకు ఎగుమతి
ఈ అవతార్ రకం ఔషధ ఉల్లిగడ్డలు రెండు నుంచి నాలుగు పాయలుగా ఉండి, లేత ఎరుపు రంగులో ఉంటాయి. కోసేటప్పుడు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండటం వల్ల వీటిని వివిధ మందుల తయారీలోనూ, వంటల్లోనూ ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే వీటికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ కొనుగోలు చేసిన ఉల్లిని తమిళనాడుకు తరలించి, అక్కడి నుంచి శ్రీలంక, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు వెల్లడించారు.
బుల్లి ఉల్లి..లాభాలు వెదజల్లి
శ్రీలంక, మలేషియాలకు తంబళ్లపల్లె చిన్న ఉల్లి ఎగుమతులు
టమాట, వేరుశనగ వదిలి ‘అవతార్’ ఔషధ ఉల్లివైపు రైతుల మొగ్గు
తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
పెట్టుబడి రూ. 90 వేలు.. ఎకరాకు
రూ. 3 లక్షల వరకు నికర లాభం!


