మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని టమాటా రైతులకు అండగా ఉండాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు పక్కదారి పడుతున్నారు. జిల్లా కేంద్రమైన మదనపల్లెతో పాటు పుంగనూరు, రాయచోటి, గుర్రంకొండ, కలకడ వంటి ప్రధాన మార్కెట్లలో 15 కిలోల క్రేట్ల విధానం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంటే, ములకలచెరువు మార్కెట్‌లో మాత్రం పాత పద్ధతిలోనే దోపిడీ సాగుతోంది. దీనిపై శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన అధికారులు, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకుండా కేవలం నివేదికలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది.
నివేదికలో నిజం.. మాటల్లో కాలయాపన!
ఈ నెల 12న ములకలచెరువు మార్కెట్‌ను సందర్శించిన మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడీ త్యాగరాజు, అక్కడ 15 కిలోల క్రేట్ల విధానం అమలు కావడం లేదని తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికీ 25 కిలోల బాక్సులతోనే విక్రయాలు సాగుతున్నాయని, అదే ప్రకారం బిల్లింగ్ జరుగుతోందని రీజనల్ జాయింట్ డైరెక్టర్ కు ఇచ్చిన నివేదికలో అంగీకరించారు. అయితే, మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు మాత్రం నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేస్తాం్ఙ అని హెచ్చరించడం వారి ‘ద్వంద్వ వైఖరి’కి అద్దం పడుతోంది.
ధరల వ్యత్యాసం..రైతుకు కోట్లలో నష్టం:
మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసం రైతును కోలుకోలేని దెబ్బ తీస్తోంది. శనివారం మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం టమాటా కిలో రూ. 12 పలికితే, ములకలచెరువులో మాత్రం రూ. 9 నుంచి రూ. 10 మాత్రమే లభించింది. 25 కిలోల బాక్సుల విధానం వల్ల వ్యాపారులు శ్రీనాణ్యత్ఙ సాకుతో ఎక్కువ కాయలను తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు. దీనివల్ల రైతుకు కిలోపై రూ. 2 నుండి రూ. 3 వరకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం అన్–సీజన్ కావడంతో నెలకు సగటున 1,200 టన్నుల కాయ వస్తోంది. అదే సీజన్‌లో అయితే నెలకు 6,000 టన్నులకు పైగా టమాటా వస్తుంది. ఈ లెక్కన సీజన్ ప్రారంభమైతే రైతులు కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది.
సాకుల పేరుతో దోపిడీకి సహకారం:
హమాలీల కొరత, రవాణా సౌలభ్యం పేరుతో కొందరు రైతులు 25 కిలోల క్రేట్లనే కోరుతున్నారని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఒకే జిల్లాలో రెండు మార్కెట్లకు రెండు వేర్వేరు నిబంధనలు ఉండటం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. రైతులకు అవగాహన కల్పిస్తున్నామనే సాకుతో అధికారులు దోపిడీకి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ గారు సమీక్షించాలి
ఈ అస్తవ్యస్త పరిస్థితులపై కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెటింగ్ అధికారులు ఇచ్చే నివేదికలు వాస్తవాలకు విరుద్ధంగా ఉంటున్నాయని, కలెక్టర్ స్వయంగా సమీక్షిస్తేనే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కే వ్యాపారుల లైసెన్సులను సస్పెండ్ చేయాలని, అన్ని మార్కెట్లలో 15 కిలోల విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ములకలచెరువులో అమలుకాని
15 కిలోల క్రేట్ల విధానం
25 కిలోల బాక్సులతోనే విక్రయాలు
ఏడీ నివేదికలో పచ్చి నిజాలు
మీడియా ముందు మాత్రం
గంభీర ప్రకటనలు
కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే
రైతులకు న్యాయం
మార్కెటింగ్ అధికారుల ద్వంద్వ వైఖరిపై అన్నదాతల ఆగ్రహం


