● రూ.7.50 లక్షల విలువైన
బంగారు నగలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు
కడప అర్బన్ : కడప నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల కేసులను చిన్నచౌక్ పోలీసులు ఛేదించారు. కుమారుడు, అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయిస్తున్న తల్లి, అక్కను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల 50 వేల విలువ చేసే 50 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు.
అరెస్టు అయిన వారిలో కడప నగరం ఎం. జె కుంట చెందిన ఉదయగిరి అమ్మాజాన్, చిరిదాపల కులాయమ్మలు ఉన్నారని తెలిపారు. తన కుమారుడు పెద్ద కుల్లాయప్ప అలియాస్ లడ్డూ, అతని స్నేహితులతో కలిసి కడపలోని శంకరాపురం, చిన్నచౌక్ ప్రాంతం, ఎర్రముక్కపల్లి, ఏపీహెచ్‌బీ కాలనీ ప్రాంతాల్లో జరిగిన 5 దొంగతనాల కేసుల్లో తమ పాత్ర ఉన్నట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. లడ్డూను గతంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరు గతంలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. పెద్ద కుల్లాయప్పపై కడప జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. వీరు తమ కుమారుడికి అండగా నిలుస్తూ, అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయించి, దొంగిలించిన సొత్తును కుదువకు పెట్టడం లేదా అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం వంటి చర్యలు కూడా చేస్తూ వచ్చారన్నారు. గతంలో ఒక సందర్భంలో తన కుమారుడిని విడుదల చేయకపోతే విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఘటన కూడా జరిగినట్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఎ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. ఓబులేసు, ఎస్‌ఐలు ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, యు. ప్రతాప్ రెడ్డి పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దొంగతనాల కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ,ఎస్‌ఐలను, పోలీసు సిబ్బందిని కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఎ. వెంకటేశ్వర్లు అభినందించి రివార్డులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.


