● 124 కేంద్రాల్లో 22,149 మంది
విద్యార్థులు పరీక్షకు హాజరు
● 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ
కెమెరాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్
● విద్యార్థులకు అందుబాటులో హెల్ప్‌లైన్ నెంబర్.91000 40686
మదనపల్లె సిటీ : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని డీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వతేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతాయన్నారు. అన్నమయ్యజిల్లాలో 124 కేంద్రాల్లో 22,149 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా సమయానికి అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి 1,177 మంది ఇన్విజిలేటర్లను, 124 కేంద్రాలకు 248 చీఫ్ సూపరిండెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించామన్నా రు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. చింతపర్తి, సీటీఎం పరీక్ష కేంద్రాలను పరిశీలించామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు. స్టేట్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తామన్నారు. పదోతరగతి పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డీఈఓ కార్యాలయంలో హెల్ప్‌లైన్ నెంబర్ 91000 40686 ఏర్పాటుచేశామని, సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. మంచి ఫలితాలతో అన్నమయ్యజిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.


