రహదారి నిర్మాణం పరిశీలన
సదుం: మండలంలోని గొంగివారిపల్లె క్రాస్ నుంచి పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. పీఎం గ్రామ్ సడక్ యోజనలో భాగంగా రూ. 8.63 కోట్ల వ్యయంతో 9.97 కిలోమీటర్ల మేర పీపీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా నిర్మాణంలో జాప్యం కలుగుతుండటంతో ఆయన తనిఖీ చేశారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పింఛన్ పంపిణీ: గొంగివారిపల్లెలో రమేష్ అనే లబ్ధిదారునికి వికలాంగ పింఛన్‌ను కలెక్టర్ అందజేశారు. తాగునీటి పంపిణీ, సచివాలయ సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని అడుగగా, సమస్యల పరిష్కారానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తన నిధులను పుష్కలంగా అందిస్తున్నారని మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, డీటీ ప్రకాశ్, ఏఈలు సిరాజ్, ప్రవల్లిక, ఆదినారాయణ, ప్రణయ్ కుమార్, ఎంఈఓ–2 దామోదర, ఏపీఓ శ్రీనివాసులు, ఏపీఎం హరిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు.
● మండలంలోని దిగువ గొల్లపల్లెలో రైతు గంగిరెడ్డి సాగుచేస్తున్న చామంతి తోటను కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. పంట సాగు విధానం, దిగుబడి మార్కెంటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పద్ధతులతో పంటలు సాగు చేయాలని కలెక్టర్ సూచించారు.


