అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్: అప్పుల బాధతో రైతు పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని అరికెల పంచాయతీ పేడరాసుపల్లికి చెందిన మునిస్వామి కుమారుడు రైతు ఆర్.నారాయణ(59) వ్యవసాయ పంటల సాగుకోసం సుమారు ఏడు లక్షల అప్పులు చేశాడు. టమాటాలు, ఇత్తర కూరగాయల పంటలను పండించారు. ప్రస్తుతం టమాటాలకు ధరలు తగ్గిపోవడంతో పంటలకు గిట్టు బాటు లేక తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు తన వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ములకలచెరువు : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని దేవులచెరువుకు చెందిన రాము బెంగళూరులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య రెడ్డెమ్మ, కుమారులు వర్షిత్, హర్ష ఉన్నారు. ఏడాదిగా ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం భార్య రెడ్డెమ్మ పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో దేవులచెరువుకు వచ్చి తల్లి రవణమ్మతో ఉంటున్నాడు. భార్య పిల్లలు తనతో లేకపోవడంతో మనస్తాపానికి చెందిన రాము(32) ఊరి బయట ఒక చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడి అన్న మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్ వివరించారు.
మండుతున్న కొండలు
బి.కొత్తకోట: మండలంలోని కొండలు, గుట్టలకు నిప్పు పెడుతుండటంతో మండుతున్నాయి. సాయంత్రం వేళల్లో పెడుతున్న నిప్పు రాత్రికల్లా విస్త్రృతంగా వ్యాపించి కొండల్లోని చెట్లు, పొదలను దహించి వేస్తున్నాయి. మూడు రోజులుగా కొండలు కాలిపోతున్నాయి. శుక్రవారం రాత్రి చలిమామిడి బీటులోని గట్టుకొండ, దాని అనుబంధ కొండలు మంటల్లో మాడిపోయాయి. ఎగసిపడిన మంటలు, వ్యాపించిన దట్టమైన పొగతో సూరప్పగారిపల్లె, గుమ్మసముద్రం పంచాయతీల్లోని పల్లెలకు పొగ అలుముకొంది. ఈ పొగతో ప్రజలు ఆందోళన చెందారు. శనివారం ఉదయం కూడా కొండలు మండుతూనే ఉన్నాయి. దీనిపై అటవీశాఖ అధికారులు.. ప్రజలు, సరిహద్దు గ్రామస్తులకు అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇలా నిప్పు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
సిద్దవటం: మండలంలోని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ ఎస్‌కేఆర్ నగర్ ఎస్సీ కాలనీలో నివాసమున్న కోటపాటి బాబురాజు(48) లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. శుక్రవారం సాయంత్రం ఆయన అధికంగా మద్యం తాగి భార్య శాంతితో గొడవపడ్డాడు. గొడవ పడుతున్న భర్త నుంచి తప్పించుకోవడానికి రహదారిపై ఉన్న సుధాకర్ దుకాణానికి వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తానని చెప్పి.. వెళ్లొచ్చేసరికి భర్త కోటపాటి బాబురాజు ఇంటి తలుపులు మూసివేసి లోపల గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందాడు. మృతుడి భార్య వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో ఇంటి తలుపులు పగలగొట్టించి, మృతి చెందిన భర్తను మంచంపై పడుకోబెట్టింది. మేనమామ అయిన పాపయ్యకు సమాచారం అందించింది. విషయాన్ని తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సిద్దవటం ఎస్‌ఐ హారిక సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తమ్ముడు విజయ్‌బాబు ఫిర్యాదు మేరకు శనివారం ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర అనుమానాస్పద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం


