కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఇంట్లో సోదాలు | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఇంట్లో సోదాలు

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఇంట్లో సోదాలు

కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఇంట్లో సోదాలు

26 కేసుల్లో నిందితుడు

ఉమర్‌ మహమ్మద్‌ నాసిర్‌

ఆస్తుల విలువ రూ.2 కోట్లకుపైగానే గుర్తింపు

రాయచోటి : కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఉమర్‌ మహమ్మద్‌ నాసిర్‌ (40) అలియాస్‌ సఫా హుస్సేన్‌ అమబ్బకు చెందిన ఇళ్లల్లో కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన పోలీసులు సోదాలు నిర్వహించారు. మంగళూరు పోలీసుల అదుపులో ఉన్న ఆయనను శనివారం రాయచోటికి తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో 26 కేసులలో నిందితుడిగా ఉండి పది సంవత్సరాలుగా కనిపించకుండా కర్ణాటక రాష్ట్రం మంగళూరు పోలీసులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన అతను రాయచోటిలో గుట్టుగా జీవనం సాగించాడు. మర్డర్లు, రేప్‌లు, కిడ్నాప్‌లు లాంటి 26 కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెండు కేసులలో యావజ్జీవ శిక్షను విధిస్తూ కోర్టులు తీర్పు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన అన్నమయ్య జిల్లా, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా.. రాయచోటిలో నాసిర్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మంగళూరు జిల్లా వ్యాప్తంగా క్రిమినల్‌ గ్యాంగులను ఏర్పరిచి మర్డర్లు, రేప్‌లు, కిడ్నాప్‌లతో ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడని కర్ణాటక పోలీసులు తెలిపారు.

మహబూబ్‌ బాషా కోసం పోలీసుల వేట

పదేళ్ల కిందట కనిపించకుండా పోయిన నాసిర్‌ రాయచోటికి చెందిన ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, గల్ఫ్‌ ఏజెంట్‌ ఎం.మహబూబ్‌ బాషా అండతో రాయచోటిలో జీవనం మొదలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నాసిర్‌ ఇచ్చిన సమాచారం మేరకు శనివారం రాయచోటిలోని మహబూబ్‌ బాషా ఇంటిని రాయచోటి పోలీసులతో కలిసి చుట్టుముట్టారు. అప్పటికే విషయాన్ని పసిగట్టిన మహబూబ్‌ బాషా ఇంటికి తాళాలు వేసి జిల్లాను దాటి పరారైనట్లు పోలీసులకు సమాచారం అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరు ఏసీపీ సుధీర్‌కుమార్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ టీమ్‌ల సమన్వయంతో రాయచోటి పట్టణం కొత్తపల్లిలో నాసిర్‌ నివసిస్తున్న ఇంటిలో సోదించారు. ఈ సోదాలో రూ.2 కోట్లకు పైగా విలువచేసే రెండు నివాస గృహాలు, కొన్ని స్థలాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే నకిలీ ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్టు, బ్యాంక్‌ అకౌంట్‌లు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌ బాషా ఆశ్రమం ఇవ్వడంతోపాటు క్రిమినల్‌కు స్థానికంగానే ఓ మహిళతో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాసిర్‌ ద్వారా స్థానికంగా మహబూబ్‌ బాషా మరికొందరితో కలిసి జరిపిన కార్యకలాపాలపైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా విచారణ కోసం కోర్టు అనుమతితో మరొక రోజు రాయచోటిలో తనిఖీలు చేపడతామని కర్ణాటక పోలీసులు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న మహబూబ్‌ బాసాను తప్పకుండా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు మీడియాకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement