యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

యువకు

యువకుడి దారుణ హత్య

మాట్లాడాలని పిలిచి

మట్టుబెట్టిన హంతకులు

చిన్నారి హత్య ఘటన మరువక ముందే మరో హత్య

వరుస హత్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

హత్య చేసి తన మామిడి తోటలోనే పాతేసిన స్నేహితుడు

నెల తర్వాత వెలుగులోకి

రావడంతో కలకలం

మదనపల్లెటౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో మరో యువకుడు దారుణ హత్యకు గురికావడం నెలరోజుల తర్వాత బయటపడింది. మాట్లాడే పని ఉందని వెంట తీసుకెళ్లిన ప్రాణ స్నేహితుడే అతని పాలిట యముడిగా మారాడు. పూటుగా మద్యం తాపించి బండ రాయితో తలపై మోది అతి కిరాతకంగా చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తీసుకెళ్లి, తన మామిడితోటలోనే అల్లనేరేడు చెట్టు పాదిలో పాతేసి ఏమీ తెలియనట్లు ఉండి పోయాడు. శనివారం వెలుగు చూసిన ఘటనపై మృతుడి కుటుంబీకులు, తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం వలసపల్లె గ్రామం అరవవాండ్లపల్లెలో ఉంటున్న లక్ష్మినారాయణ, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు పూల దివాకర్‌ (26) ఏడాది క్రితం గ్రామంలో జాతర సందర్భంగా రెండు గ్రూపుల మధ్య గొడవలు తలెత్తడంతో పరస్పరం దాడులు చేసుకున్న కేసుల్లో ఉన్నాడు. దీంతో బెంగళూరుకు వెళ్లిపోయి బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బాండ్‌ కనెక్షన్‌ ఇచ్చేపని చేసేవాడు. గత ఏడాది డిసెంబర్‌ 28న స్వగ్రామానికి వచ్చాడు. జనవరి 4న అదే ఊరికి చెందిన గణేష్‌ తదితరులతో బయటికి వెళ్లి తిరిగి రాలేదని దివాకర్‌ తల్లి లక్ష్మీదేవి కుటుంబీకులతో వచ్చి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాలూకా సీఐకి వలసపల్లి వీఆర్‌ఓ నాగేశ్వర్‌కు స్థానికులు ఇచ్చిన సమాచారంతో 150 మైలు రాయి సమీపంలోని హంద్రీ–నీవా కాలువకు సమీపంలోని క్రిష్ణప్ప మామిడి తోటలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించి సీఐకి సమాచారం అందించారు. పీఐ వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ఎవరో హత్య చేసి పాతిపెట్టినట్లు గుర్తించాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన దివాకర్‌ అదృశ్యం కేసు జనవరి 10న నమోదు చేసిన పోలీసులు వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసి మృతదేహం దివాకర్‌దిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీస్‌ బందోబస్తు మధ్య స్పాట్‌ పోస్టుమార్టం చేపట్టి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ హత్య కేసులో ఎవరెవరి పాత్ర ఉందో నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమై నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

హత్యపై పలు అనుమానాలు

పూల దివాకర్‌ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాది క్రితం గ్రామంలో జరిగిన జాతరలో రెండు ఊర్ల మధ్య భారీగా గొడవలు జరిగాయి. ఆ సమయంలో రెండు గ్రామాలకు చెందిన పలువురిపై తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ గొడవల్లో దివాకర్‌, గణేష్‌ మంచి స్నేహితులుగా ఉండే వారు. ఏ సమస్య వచ్చినా ఇద్దరే ముందుండి సమస్యను పరిష్కరించుకునే వారు. గణేష్‌కు మద్దతుగా నిలిచిన దివాకర్‌కు తప్ప తక్కిన వారందరికీ గణేష్‌ బెయిల్‌ తెప్పించాడు. దీంతో విభేదాలు వచ్చినట్లు తెలసింది. దివాకర్‌ బెంగళూరుకు వెళ్లిపోయాడు. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బాండ్‌లో పని చేస్తుండే వాడు. జనవరి ఫస్ట్‌కు వచ్చిన దివాకర్‌ గణేష్‌తో గొడవ పడ్డట్లు తెలిసింది. తనకు తప్ప అందరికీ బెయిల్‌ ఇప్పించి స్నేహానికి కళంకం తెచ్చావని, మాట్లాడే పనిపై జనవరి 4న గణేష్‌తో వెళ్లిన దివాకర్‌ పూటుగా మద్యం తాగి గొడవపడి గణేష్‌ దివాకర్‌ను బండరాయితో కొట్టి చంపేసి తీసుకెళ్లి తన మామిడి తోటలోనే పాతేసి మిన్నకుండి పోయినట్లు తెలుస్తోంది. కాగా హత్య కేసు వెలుగులోకి రావడంతో నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని సీఐ కళావెంకటరమణ తెలిపారు.

రోజుల వ్యవధిలోనే..

మదనపల్లెలో ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఏడేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రజలు మరువక ముందే మరో యువకుడి దారుణ హత్య వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు జరగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మదనపల్లెలో చిన్న చిన్న కారణాలతోనే క్షణివేశంలో యువత హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల పర్యవేక్షణ కొరవడటం, గంజాయి, కూల్‌ లిప్స్‌ వంటి వాటికి యువత బానిసలై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేసిన వైద్యులు (ఇన్‌సెట్‌) దివాకర్‌ (ఫైల్‌)

హత్య జరిగిన ప్రదేశంలో పరిశీలిస్తున్న పోలీసులు

యువకుడి దారుణ హత్య1
1/2

యువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య2
2/2

యువకుడి దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement