ఉపాధ్యాయుడు సస్పెన్షన్
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ జెడ్పీహైస్కూల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన బయాలజీ ఉపాధ్యాయుడు జాకీర్‌ను డీఈవో సుబ్రమణ్యం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు హెడ్మాస్టర్ రామచంద్ర తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయుడిపై తీరుపై విద్యార్థినిలు ఫిర్యాదు చేశారన్నారు. ఈసంఘటనపై రెండు రోజుల క్రితం మదనపల్లె డీవైఈవో లోకేశ్వరరెడ్డి విచారణ జరిపారన్నారు. ఈనేపథ్యంలో శనివారం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.
మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణా లు, సృజనాత్మకత, వికసిత్ భారత్‌కు అవసరమైన దృక్పఽథాన్ని పెంపొందించేందుకు ప్రేరణ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోను తప్పకుండా నిర్వహించాలన్నారు. సీబీఎస్‌సీ, కేవీకే, జేఎన్‌వీ పాఠశాలలో పాటు అన్ని పాఠశాలలు స్కూల్ లెవల్ ప్రేరణ ఉత్సవ్‌లో పాల్గొనాలన్నారు. ఈనెల 10న పాఠశాల స్థాయిలో 8,9,11 తరగతుల విద్యార్థులకు వికసిత్ భారత్, సమాజం, దేశం కోసం నా భాగస్వామ్యం అంశాలపై తమ ప్రతిభను ప్రదర్శించేలా పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సృజనాత్మకత వంటి ప్రమాణాల ఆధారంగా పాఠశాలకు ఇద్దరిని ఎంపిక చేస్తామని వివరించారు.
పీలేరు రూరల్: పీలేరులో ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని జేసీ శివ నారాయణ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పరిపాలన గదులను సందర్శించి, కేటాయించిన సిబ్బంది, పరిధిలోని మండలాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. రికార్డులను పరిశీలించి, కార్యాలయ ఆవరణలో పచ్చదనం పెంచాలన్నారు. అనంతరం తిరుపతి మార్గంలోని ఆయిల్ సీడ్స్‌ను సందర్శించి, దానికి కేటాయించిన భూమి వంటి వివరాలను తహసీల్దార్ శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.


