డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు
– జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
కురబలకోట : యువత, విద్యార్థులు డ్రగ్స్ మత్తులో పడకుండా డ్రీమ్స్ నెరవేర్చుకోవడంపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శనివారం ఉదయం అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ సహకారంతో అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్–ఎస్ టు లైఫ్ నినాదంతో త్రీకే రన్ నిర్వహించారు. కురబలకోట మండలంలోని రిషివ్యాలీ క్రాస్ నుంచి అంగళ్లు సర్కిల్ వరకు ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ రన్ నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అంటే ఆనందం కాదన్నారు. అది భవిష్యత్తును విచ్ఛిన్నం చేసే మరణ శాసనం లాంటిదన్నారు. వివిధ అనర్థాలకు దారి తీస్తుందన్నారు. తద్వారా జీవితం నాశనం అవుతుందన్నారు. కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆరోగ్యకర జీవితం, ఆపై ఉజ్వల భవిత కోసం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చదువులో రాణించి, క్రీడలు, వ్యాయామం, సానుకూల ఆలోచనలతో జీవితాన్ని ముందుకు సాగించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారుంటే సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామన్నారు. వారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీరిచ్చే సమాచారం ఓ కుటుంబానికి కొత్త వెలుగును ఇస్తుందన్నారు. డ్రగ్స్ సరఫరా విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మిట్స్ ఏంఎస్‌ఆర్ క్లబ్ డ్రగ్స్‌పై నిర్వహించిన స్కిట్ ఆలోచింపజేసింది. హృదయాన్ని కదిలించింది. పలువురు కంటతడి పెట్టారు. విద్యార్థుల్లో నూతన చైతన్యాన్ని నింపిన ఈ కార్యక్రమంలో వీసీ యువరాజ్, ప్రదీప్, రామనాథన్, డాక్టర్ తులసీ రామ్‌నాయుడు, మారుతీ ప్రసాద్, శ్రీనివాసులు, ముస్తఫా, యుగంధర్, పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు


