విచారణకు పిలిచి.. చేతి వేళ్లు విరిచి.. | - | Sakshi
Sakshi News home page

విచారణకు పిలిచి.. చేతి వేళ్లు విరిచి..

Feb 8 2026 4:11 AM | Updated on Feb 8 2026 4:11 AM

విచారణకు పిలిచి.. చేతి వేళ్లు విరిచి..

విచారణకు పిలిచి.. చేతి వేళ్లు విరిచి..

ఓ వృద్ధుడిపై ఖాకీల ప్రతాపం

మదనపల్లె పోలీసులపై

సీఐ విచారణ

మదనపల్లె టౌన్‌ : భార్య ఫిర్యాదు చేసిందని పోలీస్‌స్టేషన్‌కు రప్పించిన పోలీసులు.. భర్త చేతి వేళ్లను విరిగేలా కొట్టిన ఉదంతం శనివారం మదనపల్లెలో జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం కొండకింద గొల్లపల్లెకు చెందిన ముద్దలమేని వెంకటరమణ(57) భార్య నరసమ్మ(47)గత కొంత కాలంగా మానసిక స్థితి బాగలేక తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో నరసమ్మ పలు విధాలుగా ప్రవర్తించేది. గ్రామంలో స్థానికులతో గొడవలకు దిగేది. ఇందులో భాగంగానే భర్త, బిడ్డలతో ఇబ్బందికరంగా వ్యవహరించేది. గతంలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో భర్త వెంకటరమణ తన భార్య పిల్లలతో మదనపల్లెలోని అనపగుట్టకు వచ్చి నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ నరసమ్మ మానసికస్థితిలో మార్పు రాలేదని వెంకటరమణ పేర్కొన్నాడు. ఈ పరిస్థితిలో నరసమ్మ రెండు రోజుల క్రితం కలకడలోని గొల్లపల్లెకు వెళ్లి స్థానికులతో గొడవ పడి, బసినికొండలోని పుట్టింటికి వచ్చేసింది. అనంతరం టూటౌన్‌లో తన భర్త ఓ మహిళతో వివాహేతర బంధంతో తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన టూటౌన్‌ పోలీసులు వెంకటరమణను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఏమి జరిగిందో కానీ చితకబాది, చేతివేళ్లు విరిగేలా గాయపరిచారు. తర్వాత బాధితున్ని పోలీసులే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఎడమ చేయి వేలు విరిగిందని, దానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. అలాగే పెదవి లోపల అయిన గాయానికి ఆరు కుట్లు వేశారు. ఈ మేరకు బాధితుడు రాత్రి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన గోడు చెప్పుకొన్నాడు. ఈ విషయమై సీఐ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా వెంకటరమణపై సిబ్బంది చేయి చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వాస్తవాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement