
సామూహిక సెలవులో పంచాయతీ కార్యదర్శులు
రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిధిలోని పలు గ్రామ సచివాలయాలలో విధులు నిర్వర్తించే పంచాయతీ కార్యదర్శులు సామూహిక సెలవు ప్రకటిస్తూ ఎంపీడీఓ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయచోటి పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీనివాసులు, గొర్లమొదివీడు కార్యదర్శి రమాదేవి, శిబ్యాల కార్యదర్శి వెంకటరమణ, పెమ్మాడపల్లె కార్యదర్శి సాజియా, దిగువ అబ్బవరం కార్యదరి శివలక్ష్మి, కాటిమాయకుంట కార్యదర్శి మల్లికార్జునలను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. దీనిని నిరసిస్తూ సామూహికంగా సెలవుపై వెళుతున్నట్లు తెలిపారు.
అక్రమంగా మట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు
గాలివీడు : అక్రమంగా మట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ భాగ్యలత హెచ్చరించారు. ఈనెల 20 వ తేదీన సాక్షి దినపత్రికలో ‘పెద్ద చెరువును చెరబట్టారు‘ అనే శీర్షికతో వెలువడిన కథనంపై స్పందించిన తహసీల్దార్ గురువారం పెద్దచెరువులో మట్టి తరలిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువులోకి ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలు వెళ్లకుండా మార్గాలను మూసివేస్తూ ట్రెంచ్ (గొయ్యి) తీయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుట్టలు, వాగులు, వంకలు, చెరువుల్లో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు పెట్టి జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేస్తామన్నారు.
అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన
రాజంపేట : అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే దాడిని నిరసిస్తూ ఏపీ ఫారెస్టు జూనియర్ ఆఫీసర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాజంపేటలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కేవీ సుబ్బయ్య, అధ్యక్షుడు రవిశంకర్(రాజంపేట యూనిట్) మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఫారెస్టు మినిస్టీరియల్ అసోసియేషన్, ఏపీఎన్‌జీఓ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సామూహిక సెలవులో పంచాయతీ కార్యదర్శులు

సామూహిక సెలవులో పంచాయతీ కార్యదర్శులు