
భూ వ్యవహారంలో హోంగార్డు జోక్యం
● చేనేత కార్మికులకు బెదిరింపులు
● డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
మదనపల్లె రూరల్ : భూ వ్యవహారాల్లో హోంగార్డు రాజశేఖర్ జోక్యం చేసుకుని, చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కలిగిన చేనేత కార్మికులను బెదిరిస్తున్నాడని బాధితులు డీఎస్పీ మహేంద్రకు ఫిర్యాదు చేశారు. గురువారం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులు డీఎస్పీ మహేంద్రను కలిసి తమకు జరిగిన అన్యాయంపై విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కోళ్లబైలు పంచాయతీ సర్వే నంబర్.605–2బీలో 20 ఏళ్ల క్రితం సుమారు 50 మంది చేనేత కార్మికులు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నామన్నారు. అప్పట్లో సరైన మౌలిక వసతులు లేని కారణంగా ఇళ్ల నిర్మాణం చేయలేకపోయామన్నారు. ప్రస్తుతం రోడ్లు, ఇతర వసతులు సమకూరడంతో గ్రామ సచివాలయం నుంచి ప్లాన్ అనుమతులు పొంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తే కొందరు వ్యక్తులు కావాలనే అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పదిరోజుల క్రితం భూములను దున్నేసి వెళ్లారన్నారు. దీనిపై తాలూకా పోలీస్ స్టేషన్‌లో సీఐకు ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల క్రితం భవన నిర్మాణ సామగ్రి భద్రపరచుకునేందుకు చిన్నపాటి షెడ్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకుంటుంటే, రాత్రి 10 గంటల సమయంలో మంజునాథ్, హోంగార్డు రాజశేఖర్‌లు జేసీబీతో వాటిని ధ్వంసం చేసి నష్టం కలిగించారన్నారు. మూడేళ్లుగా కొందరు వ్యక్తులు కావాలనే భూముల విషయంలో ఇబ్బందులు పెడుతుండటంతో కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నారు. ప్రస్తుతం చట్టపరమైన అన్ని అనుమతులతో ఇళ్ల నిర్మాణాలకు వెళుతుంటే, హోంగార్డు రాజశేఖర్ సహాయంతో దౌర్జన్యం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. చేనేత కార్మికులమైన తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూముల్లో ఇతరుల జోక్యం లేకుండా, ఇళ్లు నిర్మించుకునేందుకు పోలీసు శాఖ సహకరించాలని కోరారు.