
విద్యా సంస్థల్లోకి నో ఎంట్రీ !
● విద్యార్థి సంఘాలపై నిషేధం
● కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు
మదనపల్లె సిటీ : కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణచి వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకు సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,711, ప్రాథమికోన్నత 162, ఉన్నత పాఠశాలలు 304 ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 24, ప్రైవేటు 58, ఎయిడెడ్ 1, ఆదర్శ 17, సాంఘిక సంక్షేమ 10, బీసీ గురుకులాలు 1, కేజీబీవీ 22, వృత్తి విద్యా కాలేజీలు 10 ఉన్నాయి. గత నెలలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో వసతి లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి ఇవ్వద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాలేజీల్లోకి రాకూడదంటూ మరో జీఓ..
విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, పలు సమస్యలు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, అధిక ఫీజు వసూలు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడంపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం మరోసారి జూనియర్ కాలేజీల్లోకి సైతం విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ మరో జీఓను జారీ చేసింది. విద్యార్థి సంఘాలు విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహనకు, హక్కులు, బాధ్యతలను నేర్పిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక విద్యార్థి సంఘాలను అణచివేయడం ద్వారా ప్రశ్నించే, పోరాడే శక్తులను నిలువరించాలని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం లేకుండా చేయాలనే ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని, నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.