
భలే కేటుగాళ్లు..!
తిరుపతి క్రైమ్ : సెల్ ఫోన్లు చోరీ చేసి ఆ సెల్ ఫోన్ ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలోని నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్ విలేకరులకు తెలిపిన వివరాలు..హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కసిరెడ్డి ఓ ముఠాగా ఏర్పడి నగరంలో సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడేవారు. అలా చోరీ చేసిన మొబైల్ ఫోన్లలో ఆ వ్యక్తుల ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడకు వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమీషన్ కూడా ఇస్తామని వారిని నమ్మిస్తారు. ఇలా కహానీలు చెప్పి వీరంతా 49 సెల్ ఫోన్లు దొంగతనం చేసి 3.6 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 సెల్ ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హేమాద్రి, సిబ్బంది కృషి చేశారని డీఎస్పీ వారిని అభినందించారు.
సెల్ ఫోన్లు చోరీ చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు హాంఫట్
ముగ్గురు నిందితుల అరెస్ట్
46 సెల్‌ఫోన్లు, రూ.2.8లక్షలు స్వాధీనం
నిందితులు హైదరాబాద్,
అన్నమయ్య జిల్లా, నెల్లూరు వాసులు