
మున్సిపల్ ఖజానాకు రూ.20 లక్షల గండి
మదనపల్లె : మదనపల్లె మున్సిపల్ ఖాజానాకు వెళ్లాల్సిన లీజు సొమ్ముకు అధికారులు గండి కొడుతున్నారని సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళీ ఆరోపించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక దినసరి, వారపు సంత గేటు వసూళ్ల లీజును హెచ్చు పాటదారునికి అప్పగించడంలో అధికారులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారని ప్రశ్నించారు. కౌన్సిల్ దీనికి ఎందుకు ఆమోదం తెలపలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. లీజు అప్పగించడంలో జరిగిన జాప్యం ఫలితంగా రోజుకు రూ.48వేల ఆదాయాన్ని మున్సిపాలిటీ కోల్పోయిందన్నారు. రూ.20 లక్షల దాకా జరిగిన నష్టం జరిగితే కమిషనర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
కర్ణాటక సరిహద్దులో కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : కర్ణాటక సరిహద్దు ప్రాంతం రాయల్పాడు సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో చీకలబైలుకు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. చీకలబైలుకు చెందిన గంగరాజు(27), శశి(24) ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు. జీవనోపాధిలో భాగంగా కర్ణాటకలో పనికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, రాయల్పాడు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను ఆటోలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాయల్పాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
బి.కొత్తకోట : ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట సమీపంలోని శెట్టిపల్లికి చెందిన ఎం.నాగరాజు కుమార్తె స్రవంతి (16) ఇంటర్ చదువుతోంది. తల్లి దండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకోగా గుర్తించిన కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.

మున్సిపల్ ఖజానాకు రూ.20 లక్షల గండి