
సామాజిక తనిఖీ బహిరంగ సభలో టీడీపీ నేతల బాహాబాహీ
గుర్రంకొండ : సామాజిక తనిఖీ బహిరంగ సభా ప్రాంగణంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగిన అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు సభా ప్రాంగణం వద్దనే బాహాబాహీకి దిగాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోవడంతో అధికారులు హడలెత్తిపోయారు.
బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. 2024–25 ఏడాదికి సంబంధించి మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలను అధికారులు బహిరంగంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా మండలంలోని శెట్టివారిపల్లెలో గోకులం షెడ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేసుకోవడంతో పాటు జిల్లా అధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నారు. ఇదే విషయమై బహిరంగసభలోనూ వాగ్వాదం చేసుకొన్నారు. సదరు గ్రామానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు చదివి వినిపించిన తరువాత అందరూ కలిసి సభ జరుగుతున్న భవనం వెలుపలికి చేరుకున్నారు. గోకులం షెడ్లలో జరిగిన అవినీతిపై ప్రశ్నించడానికి మీరెవరంటూ టీడీపీ నేతలు రెండు వర్గాలగా విడిపోయి బాహాబాహీకి దిగారు. మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఒక వర్గం నేతలు తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో మరో వర్గం రెచ్చిపోవడంతో వాగ్వాదం పెద్దదిగా మారి అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరుపులు, కేకలతో సభా ప్రాంగణం గందరగోళంగా మారడంతో అధికారులు హడలెత్తిపోయారు. అందరు కలసి సమావేశం నుంచి వెలుపలికి వచ్చి టీడీపీలోని ముఖ్యనాయకులు, అధికారులు రెండువర్గాల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవినీతిపై టీడీపీ నేతలు పరస్పరం ఘర్షణ పడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
అవినీతిపై వాగ్వాదం
సవాళ్లు, ప్రతిసవాళ్లతో
దద్దరిల్లిన ప్రాంగణం