
పెన్నానదిలో యువకుడి గల్లంతు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం సమీపంలోని రెండు కుళాయిల వద్ద ఉన్న పెన్నానదిలో నాయుని విక్రమ్ (20) అనే యువకుడు గల్లంతయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రమ్ వన్‌టౌన్ సర్కిల్‌లోని టీ దుకాణంలో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అతను తన స్నేహితులు వెంకటసాయి, ముత్తయ్య, శివలింగమయ్యలతో కలిసి బుధవారం పెన్నానదికి వెళ్లాడు. మిత్రులందరూ పెన్నానదిలో కొంత సేపు సరదాగా గడిపారు. కొంత సేపటి తర్వాత మళ్లీ వస్తానని చెప్పి విక్రమ్ వారికి దూరంగా వెళ్లాడు. అలా వెళ్లిన అతను నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బోటు సాయంతో నదిలో గాలించారు. నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో విక్రమ్ ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రోదించసాగారు. యువకుడి తల్లి రుక్మిణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
అవయవ దానం చేసి..
ప్రాణదాతగా నిలిచి..
మైలవరం : అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తారు. సరిగ్గా ఇదే రోజున వైద్యులు కల్పించిన అవగాహనతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. వివరాలు ఇలా.. ఈనెల 10వ తేదీన మైలవరం రిజర్వాయర్ గేట్ల వద్ద ప్రమాదవశాత్తు గోడ మీద పడిన దుర్ఘటనలో శివరామసుబ్బయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. వైద్యులు ఇచ్చిన స్ఫూర్తితో మృతుని కుటుంబ సభ్యులు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులను దానం చేశారు.

పెన్నానదిలో యువకుడి గల్లంతు