
రేషన్ షాపులపై ఫిర్యాదులు వస్తే చర్యలు
మదనపల్లె రూరల్ : రేషన్ షాపులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని రేషన్ షాపులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. షాపునకు స్టాక్ ఎంత వచ్చింది? పంపిణీ ఎంత చేశారు ? మిగిలిన సరుకులను తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న రేషన్ లబ్ధిదారులను రేషన్ షాపు యజమాని సమయపాలన పాటిస్తున్నారా..? సరుకులను కచ్చితమైన తూకంతో అందిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధిగా రేషన్ షాపులు తెరవాలన్నారు. 65 సంవత్సరాలకు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటివద్దనే రేషన్ ఇవ్వాలన్నారు. రేషన్ దుకాణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ డీటీ ఎన్.ఫిరోజ్‌ఖాన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్