
వరకట్న మరణం కేసులో పదేళ్ల జైలు శిక్ష
నందలూరు : వరకట్న మరణం కేసులో ముద్దాయి పామూరు సాయివర్ధన్‌కు రాజంపేట 3వ ఏడీజే కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నందలూరు టౌన్ బ్రాహ్మణవీధికి చెందిన పామూరి సాయివర్ధన్ తన భార్య పామూరి లక్ష్మీప్రసన్న(22)ను అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఆమె భర్త వేధింపులు తాళలేక 2023వ సంవత్సరం మార్చి 29వ తేదీన తన చున్నీతో ఉరి వేసుకొని చనిపోయినట్లు, మృతురాలి తండ్రి రావూరు కనకరత్న ఆచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నందలూరు ఏఎస్‌ఐ జేవీ సుబ్బరాయుడు క్రైం నెంబర్ 79/2023, యు/సెక్షన్ 304(బి) ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పటి రాజంపేట డీఎస్పీ జి.శివభాస్కర్‌రెడ్డి, మరో డీఎస్పీ వీఎన్‌కె చైతన్య సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను సేకరించి దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా రాజంపేట 3వ ఏడీజే కోర్టు విచారణ జరిపి ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.