
మూడు ముక్కలాట?
మదనపల్లె: కూటమి ప్రభుత్వ ప్రభావమో, స్థానిక రాజకీయ వర్గపోరు వల్లనో కాని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇక్కడి పరిస్థితులు మూడు పార్టీల మధ్య చైర్మన్ పదవి మూడు ముక్కలాటగా మారింది. ఎవరికి వారు చైర్మన్, కమిటీ డైరెక్టర్ల పదవులకు జాబితాలు తమ నేతల ద్వారా సమర్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ది కీలకపాత్ర ఉంటుంది. చైర్మన్ పదవికి ఎవరి పేరు సిఫార్సు చేశారో ఆయన మనసులోని మర్మం బయట పెట్టడం లేదు. దీనికి స్థానిక రాజకీయ పరిస్థితులే కారణమని చెబుతున్నారు.
ఎమ్మెల్యే మర్మం రహస్యం
మదనపల్లె మార్కెట్ కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే షాజహాన్ ఒకరి పేరును సిఫార్సు చేశారని, ఆ పేరు గుర్తులేదని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంటే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన ఆ నేత పేరు బయటకు రాకపోవడం బట్టి చూస్తే కూటమి పార్టీలు అప్రమత్తం అవుతాయని, లేదంటే వ్యతిరేకత వస్తుందని రహస్యంగా ఉంచారని భావిస్తున్నారు. ఇది వర్గపోరు మరింత తీవ్రత పెంచితే తలనొప్పి తప్పదని జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికి ఈ వ్యవహారం కిందిస్థాయి మార్కెటింగ్‌శాఖ అధికారులు తమకు తెలియదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేర్లు బహిరంగం కాకూడదన్న ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే కమిటీ చైర్మన్‌గా ఎవరున్నా దానికి గౌరవ చైర్మన్ ఎమ్మెల్యేనే కాబట్టి అధికారాలన్ని ఆయనే చెలాయించే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే ఆదేశాలను ఽఅధికారులు దిక్కరించి వ్యవహరించే పరిస్థితి ఉండదు కనుక..ఎమ్మెల్యే కూటమి పార్టీల తీరును గమనించేందుకు ఆ పేరును రహస్యంగా ఉంచారేమో అని పార్టీ వర్గాల్లో చర్చించుకొంటున్నారు.
జనసేన కమిటీ సిఫార్సు
స్థానిక జనసేన నేత చైర్మన్, డైరెక్టర్ల పేర్లతో కమిటీకి సిఫార్సు చేశారు. జనసేన మంత్రి, టీడీపీకి చెందిన ఓ మంత్రి ద్వారా తాను సిఫార్సు చేసిన కమిటీకి ఆమోదం లభించేలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యే సిఫార్సు చేసిన కమిటీకి పోటీగా సిఫార్సు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొన్నట్టే. అయితే ఎమ్మెల్యే సిఫార్సుకు ఆమోదం లభిస్తుందా లేక జనసేన కమిటీకి పదవులు లభిస్తాయా అన్నది చర్చనీయాంశమైంది. అధికారంలోని రెండుపార్టీల మధ్య పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. కాగా కమిటీలో డైరెక్టర్ పదవుల కోసం బీజేపీకి చెందిన కొందరి నుంచి వారి వ్యక్తిగత వివరాలను సేకరించారు. కొందరి పేర్లను సిఫార్సు చేశా రని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీకి వైస్‌చైర్మన్ పదవిని కట్టబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేనే చైర్మన్..
నేనే మార్కెట్ చైర్మన్ అంటూ ఓ స్థానిక నేత తమపై పెత్తనం చెలాయించడం పట్ల మార్కెటింగ్ అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మదనపల్లె మార్కెట్ చైర్మన్ పదవిని కలెక్టర్ శ్రీధర్ జనరల్ మహిళకు కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వం ఇంతవరకు చైర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వు జారీచేయలేదు. అయితే ఆ నాయకుడు మార్కెట్ యార్డులో పరిస్థితుల గురించి అదేమైంది, ఇదేమైంది, నేను బాధ్యతలు చేపట్టే వరకు ఏపని చేయొద్దు అంటూ హుకుం జారీ చేయడంపై అధికారులు విస్తుపోతున్నారు.
తమ్ముళ్ల తికమక
కూటమి పార్టీల మధ్య మార్కెట్ కమిటీ వ్యవహరం రసవత్తరంగా మారడంతో టీడీపీ తమ్ముళ్లు తికమక పడుతున్నారు. పదవులను పొందడం కోసం ఎదురుచూస్తున్నారు. పొరుగు నియోజకవర్గాల్లో నామినేటెడ్, సింగిల్‌విండో త్రీమెన్ కమిటీలు భర్తీ చేస్తుంటే.. మదనపల్లెలో ఇవేమిలేక నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీలోనైనా పదవులు పొందాలనుకుంటే కూటమి పార్టీల మధ్య పోటీతో తమ్ముళ్లు ఉసూరుమంటున్నారు. కనీసం పార్టీ పదవులనైనా దక్కుతాయంటే అవీ ఎండమావిగానే కనిపిస్తున్నాయని నిట్టూరుస్తున్నాయి. వర్గాల మధ్య పోరుతో ఎవరికి ఏ పదవి ఇస్తారో లేక ఇవ్వరో అని ఆశలు వదులుకుంటున్నారు.
మదనపల్లె చైర్మన్ పదవికి ఎమ్మెల్యే పంపిన పేరు రహస్యం
జనసేన తరపునా పేర్లతోకమిటీకి సిఫార్సు
బీజేపీ వర్గీయులకు డైరెక్టర్ పోస్టులు
తానే చైర్మన్ అంటూ అధికారులపై ఓ నేత పెత్తనం

మూడు ముక్కలాట?