
రాజంపేట ఎంపీపీగా రమణమ్మ
రాజంపేట టౌన్ : రాజంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) మండలంలోని తుమ్మల అగ్రహారానికి చెందిన ఆరెళ్ళ రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా ఉన్న వై.వెంకటనారాయణ మృతి చెందడంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో అధికారులు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఎంపీపీ పదవికి ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున కూచివారిపల్లె–2 ఎంపీటీసీగా ఎన్నికై న ఆరెళ్ళ రమణమ్మ ఎంపీపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. రమణమ్మ ఆభ్యర్థిత్వాన్ని ఆర్.బుడుగుంటపల్లె ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి ప్రతిపాదించగా తాళ్ళపాక ఎంపీటీసీ డి.మధుసూదన్‌వర్మ బలపరిచారు. రాజంపేట మండలంలో మొత్తం 16 ఎంపీటీసీలకు ఇద్దరు మృతి చెందారు. దీంతో 14 మంది ఎన్నికలో పాల్గొని రమణమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజనల్ డెలప్‌మెంట్ ఆఫీసర్ నరసింహమూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ పగడాల వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆరెళ్ల రమణమ్మ విలేకరులతో మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈసందర్భంగా ఎంపీటీసీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.