
●ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మారుతీ నగర్ కు చెందిన వెంకటేష్ భార్య కృష్ణమ్మ (44) కుటుంబ సమస్యల కారణంగా సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
తల్లిదండ్రులు మందలించారని..
తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారి పల్లె అయోధ్య నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు ఉదయ్ కుమార్ (25) నాలుగు రోజులపాటు ఇంటికి రాకుండా వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన కుమారుడిని తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఉదయ్ కుమార్ ఇంటి వద్ద నిద్రమాత్రలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.