
మాండవ్య నది నీటిని మళ్లించారు
రాయచోటి టౌన్ : మాండవ్య నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ పక్కన కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించారని దీనిపై పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఓదివీడు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ నది పరివాహక ప్రాంతంలో ఓదివీడు, కస్పా, బెస్తపల్లె, గంగరాజుపల్లె, పత్తిరాజుగారిపల్లె, మట్లి గ్రామాలకు చెందిన దాదాపు 500 ఎకరాల భూముల్లో పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చెక్‌డ్యాం ఎత్తును తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరారు.
బావిలో పడి వ్యక్తి మృతి
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కుమ్మరపల్లె పంచాయతీ ఎగువ దళితవాడకు చెందిన రేనిమాని చిన్నప్ప(52) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బావిలో మోటారు చెడిపోయిందని చూసేందుకు వెళ్లి సోమవారం ఉదయం బావిలో పడిపోయాడు. కొద్ది గంటల పాటు పైకి రాకపోవడంతో గ్రామస్తులు ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నప్ప బావిలో ఉన్న మోటారు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెగిపడిన విద్యుత్ తీగలు
గుర్రంకొండ: వర్షాలకు 11 కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. అయితే అక్కడ జనసంచారం లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. సోమవారం గుర్రంకొండ బస్టాండులో హోరున వర్షం కురుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్క సారిగా 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఓ వైపు దుకాణాల మీద మరోవైపు నిత్యం జనాలు కూర్చోనే బల్లల వద్ద పడ్డాయి. ఆయితే వర్షం కారణంగా సకాలంలో అక్కడ జనసంచారం లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే బస్టాండులో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.

మాండవ్య నది నీటిని మళ్లించారు