
అక్రమ వసూళ్లు రూ.16.40 లక్షలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో 2024 ఆగస్టు నెల నుంచి సుమారు రూ.16.40 లక్షలు యూజర్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లు చేసినట్టు తేలిందని కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేయవద్దని చెప్పినప్పటికీ వ్యాపార సంస్థల నుంచి క్లాప్ యూజర్ చార్జీలు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఆరు ప్రత్యేక బృందాలతో పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 2414 మందిని విచారించగా 258 మంది తాము యూజర్ చార్జెస్ ఇచ్చామని చెబుతూ అందుకు సంబంధించిన రశీదులు, ఆధారాలు చూపారన్నారు. మిగిలిన 2156 మంది తాము ఎలాంటి యూజర్ చార్జీలు చెల్లించలేదని చెప్పారన్నారు. రూ.4,20,750లకు స్లిప్పులు తగిన ఆధారాలు ఉన్నాయని, రూ.12,19,500లకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇందులో 2024 ఆగస్టు నుంచి కార్పొరేషన్‌కు రూ.7 లక్షలు జమ అయిందన్నారు. తమ విచారణలో బయటపడిన నాలుగు లక్షల 20 వేల 750 రూపాయలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. దీనిపై ఇదివరకే ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు మరో ఏడుగురు శానిటరీ సెక్రటరీలు, ముగ్గురు ఆప్కాస్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే తెలపాలని, వాటిపై కూడా విచారణ చేస్తామన్నారు. ఇకపై యూజర్ చార్జీలు వసూలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
అనధికారికంగా లేఔట్‌లు వేసిన వారు, అందులో ప్లాట్లు కొన్నవారు 24వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్టర్ అయిన ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. 45 రోజుల్లో మొత్తం ఫీజు చెల్లించిన వారికి 10 శాతం, 90 రోజుల్లో చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కడప నగరంలో సుమారు వందకు పైగా అనధికారిక లేఔట్‌లు ఉన్నాయని, వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అందులో రూ. 7 లక్షలు నగరపాలక
సంస్థకు చెల్లింపు
రూ. 4.20 లక్షలకు ఆధారాలు లభ్యం
ఆరు బృందాలతో 2414 మందిని విచారణ
మీడియాతో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్‌రెడ్డి