
ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో మదనపల్లి, కొత్త ఇండ్లు, రంగారెడ్డి కాలనీకి చెందిన కొలై రవి అలియాస్ బాబుకు ఏడాది జైలు శిక్ష, పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతిలోని ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి ఎస్.శ్రీకాంత్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కడప ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది 2010 ఫిబ్రవరి 23వ తేదీ కడప డివిజన్, కడప రేంజ్, ఆలంఖాన్‌పల్లి అటవీ ప్రాంతం సమీపంలో నిందితుడు రవి మరో ఇద్దరితో కలిసి 3703 కిలోల 146 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి కేసు పూర్వాపరాలు పరిశీలించి ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ప్రమాదంలో
గాయపడిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లె మండలం బీఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న అట్లూరి రాజన్న(65) ఈనెల 7వ తేదీ సాయంత్రం ఎర్రగానిమిట్ట సమీపంలో ఆటో కోసం రోడ్డుపై వేచి ఉండగా, అదే సమయంలో అటువైపుగా వచ్చిన గుర్తు తెలియని ఇన్నోవా కారు ఢీకొని వెళ్లిపోయింది. దీంతో తీవ్రగాయాల పాలైన రాజన్నను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల : వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఆర్ అసోసియేట్స్ సంస్థ అధినేత చరణ్ తేజ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,10,116 విరాళంగా అందించారు. ఈమేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.