
టిప్పర్ డ్రైవర్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, ఆటో తీసివ్వలేదని మనస్తాపంతో టిప్పర్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. గాలివీడు మండలం సలారివారిపల్లెకు చెందిన బాలయ్య, నారాయణమ్మ దంపతుల రెండో కుమారుడు మల్లూరి అనిల్‌కుమార్(32)కు బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన రవి కుమార్తె స్వరూపతో పదేళ్ల క్రితం పెళ్లయింది. అనిల్‌కుమార్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం మదనపల్లెకు వచ్చి బసినికొండ అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వీరికి కుమారుడు జేమ్స్‌కింగ్(6), కుమార్తె లిప్సిక(4) ఉండగా, వారు బడికాయలపల్లెలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. భార్య స్వరూప మదనపల్లెలోని ఓ హోటల్‌లో పనిచేసేది. ఈ క్రమంలో కొంతకాలం క్రితం టిప్పర్ డ్రైవర్‌గా పనిమానేసి ఆటో కొనుగోలు చేయాలని అనిల్ భార్యతో చర్చించాడు. అందుకు అవసరమైన నగదు అత్తింటివారిని అడగమని భార్యకు చెప్పి ఇద్దరూ వెళ్లి అడిగారు. అయితే అత్తింటివారు తాము నగదు సమకూర్చలేమని తేల్చి చెప్పారు. దీంతో ఇంటికి చేరుకున్న భార్యాభర్తలు ఇదే విషయమై గొడవపడ్డారు. భార్య తాను పనిచేసి నగదు సమకూర్చుతానని, వారంరోజుల క్రితం తిరుపతికి వెళ్లి ఓ హోటల్‌లో పనికి కుదిరింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన అనంతరం అనిల్‌కుమార్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే నాలుగురోజులుగా ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎదురింట్లోని వ్యక్తి కిటికీలో నుంచి ఇంట్లోకి తొంగి చూశాడు. అనిల్ ఉరికి వేలాడుతున్న విషయం గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో తాలూకా ఎస్‌ఐ గాయత్రి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గాయత్రి తెలిపారు.