
దేశ రక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యం
మదనపల్లె రూరల్ : దేశానికి రక్షణగా నిలబడింది. నిలిచేది కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ అన్నమయ్య జిల్లా 2వ మహాసభల్లో భాగంగా తొలిరోజైన ఆదివారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుంచి పెద్దసంఖ్యలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణ థియేటర్ ఎదురుగా సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్.నరసింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఈశ్వరయ్య మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ సంపదను కార్పొరేట్ రంగాలకు దోచిపెడుతున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు ప్రజాధనంతో ఏర్పాటైన ఎల్‌ఐసీ, రైల్వే, విమానం, ఓడరేవులు, రోడ్లు, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ పాలనలో ఒక ఉపాధి అవకాశం దొరకలేదన్నారు. దేశప్రజల సొమ్మును దోచుకుని కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులు విదేశాల్లో దాచుకుంటే, వారికి రూ.16లక్షల50 కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంటే తిరిగి రెండోసారి అమరావతి అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్‌చార్జీలు, స్మార్ట్ మీటర్లపైన తీవ్ర వ్యతిరేకత కనబరిచిన టీడీపీ, స్మార్ట్‌మీటర్లు, విద్యుత్‌చార్జీల భారాన్ని ప్రజల మీద మోపడంలో వెనకడుగు వేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 10వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీని సాధించుకుని జిల్లా అభివృద్ధికి దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జల్లా విశ్వనాథ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి నిధులు తేవడంలో
కూటమిప్రభుత్వం వైఫల్యం
జిల్లా సమగ్రాభివృద్ధికి
10వేల కోట్లు కేటాయించాలి
సీపీఐ అన్నమయ్యజిల్లా 2వ మహాసభలు ప్రారంభం