
దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్‌రెడ్డి కన్నుమూత
సంబేపల్లె : వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్‌రెడ్డి (73) మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త వినగానే ఆవుల కుటుంబ సభ్యులతో పాటు రాయచోటి నియోజకవర్గం, సంబేపల్లె మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిత్యం ప్రజలలోనే..
ఆవుల వేణుగోపాల్‌రెడ్డి నిత్యం ప్రజల మనిషిగానే మెలిగేవారు. ఎవరు ఏ సహాయం కావాలని అడిగినా స్పందించే నాయకుడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలానే పేద విద్యార్థుల విద్యకు అండగా నిలిచేవారు. దేవపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన చిన్న వయస్సులోనే సినీ నిర్మాణంపై ఆసక్తి చూపుతూ దేవపట్ల – సంబేపల్లె ప్రాంతాలలో పలు చిత్రాల చిత్రీకరణకు సహకరించారు. వేణుగోపాల్‌రెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, రెండవ కుమారుడు ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి డీసీఎంస్ చైర్మన్‌గా పని చేశారు. అలాగే ఆమె కోడలు నాగశ్రీలక్ష్మి ప్రస్తుతం సంబేపల్లె ఎంపీపీగా ఉన్నారు. మూడో కుమారుడు మల్లికార్జునరెడ్డి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. కాగా మండల పరిధిలోని దేవపట్ల పంచాయతీ ఆవులవాండ్లపల్లెలో 12 వ తేదీ మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.