
కిడ్నాప్ కేసులో న్యాయం చేయలేదని పోలీస్ స్టేషన్ ముట్ట
రామసముద్రం : మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆదివారం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. బాధితుల వివరాల మేరకు రామసముద్రం ఆంజనేయస్వామి కాలనీకి చెందిన మైనర్ బాలికను బి.కొత్తకోటకు చెందిన గణేష్ అనే యువకుడు ఏడోతేదీ రాత్రి ఇంటితాళాలు పగలగొట్టి కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఇంటి బీరువాలో ఉన్న బంగారు నగలు, మూడు లక్షల నగదు ఎత్తుకెళ్లాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో తామే నిందితుని ఆచూకీ కనుక్కొని ఆదివారం మైనర్ బాలికతో పాటు గణేష్‌ను పోలీసులకు అప్పగించినట్లు బాధితులు తెలిపారు. ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన బంగారు నగలు, డబ్బు నిందితుని నుంచి రాబట్టి అతనిపై కేసు నమోదు చేయాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేశారు. ఒకానొకదశలో పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. ఈ విషయంపై గణేష్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.