
పోలింగ్‌కు సర్వం సిద్ధం
● ముగిసిన ప్రచార ఘట్టం
● ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
● కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు
● కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి,ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్
కడప సెవెన్‌రోడ్స్: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12వ తేది జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆదివారం ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు మొత్తం 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసేంతవరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. సోమవారం సాయంత్రానికంతా పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించిన తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, రెండవ విడత సోమవారం నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. వీటిలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉంటాయన్నారు. వెబ్‌కాస్టింగ్‌కు అవకాశం లేనిచోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ ఏరియాకు ఒక మైక్రో అబ్జర్వర్ ఖచ్చితంగా ఉంటారన్నారు. ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలన్నారు. లేనిపక్షంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని, ఇంకా మిగిలిన వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలతో కూడిన పలు వినతులు రాగా, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు.
● ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ఓటర్ల కోసం బస్సులు, ఆటోలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే హెల్ప్‌డెస్క్, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, వి.కొత్తపల్లె ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చడం పట్ల వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, వివరాలను తొలుతే ప్రదర్శించి అభ్యంతరాలను ఆహ్వానించామని కలెక్టర్ చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం వల్ల వీటిని ఖరారు చేశామన్నారు. ఈనెల 14వ తేది కడప సమీపంలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు.
పోలింగ్ సజావుగా సాగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. సీసీ కెమెరాలతోపాటు రూట్ మొబైల్స్, స్టైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 13 జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులతోపాటు పులివెందుల, ఒంటిమిట్ట పరిసరాల్లోని 15 చెక్‌పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామన్నారు. పెట్రోలింగ్ పార్టీలు, మొబైల్ వీడియో కెమెరాలు, నేత్ర వాహనాలతోపాటు రెండు అత్యాధునిక డ్రోన్స్ వినియోగిస్తున్నామని వివరించారు. గ్రామాలను క్లస్టర్లుగా విభజించామన్నారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అదికారి ఓబులమ్మ పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ